ముచ్చటగా మూడోసారి..

2 Nov, 2016 01:11 IST|Sakshi
ముచ్చటగా మూడోసారి..

పాలమూరు డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ సర్వేకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం  
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ (పిల్లకాల్వల వ్యవస్థ) సర్వేకు ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గత రెండు టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరగడంతో మరోమారు టెండర్లు అనివార్యమయ్యాయి. టెండర్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా ఈ నెల 10న టెక్నికల్ బిడ్‌లు, తరువాత వారం రోజుల్లో ప్రైస్ బిడ్‌లు తెరవనున్నారు. పాల మూరు ప్రాజెక్టు ప్రధాన కాల్వ, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రూ.30వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు చేయగా.. ఈ ఏడాది మేలో డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు.

పిల్ల కాలువల సర్వేకు సంబంధించిన రూ.82 కోట్ల విలువ చేసే పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఇందులో 25 ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేయగా.. 12 ఏజెన్సీల బిడ్లను సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ తిరస్కరించారు. ఇందులో ప్రముఖ సర్వే సంస్థ వ్యాప్కోస్ కూడా ఉండ టం, అర్హత సాధించిన ఏజెన్సీల్లో తక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీలను (ఎల్-1)ను పక్కన పెట్టి ఇతర ఏజెన్సీలకు కాంట్రాక్టు కట్టబెట్టారన్న ఆరోపణలతో కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) ఈ టెండర్లను తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో అంచనాలను సవరించి రూ.92 కోట్లు విలువ చేసే సర్వే పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి మరో మారు టెండర్లు పిలిచారు. రెండోమారు కూడా ఎల్-1, ఎల్-2ను పక్కనపెట్టి ఎల్-3కి కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలు రావడంతో.. ఎంపిక చేసిన ఏజెన్సీల అర్హతను ప్రశ్నిస్తూ.. సీఓటీ మరోమారు టెండర్లను రద్దు చేసింది. దీంతో ఈసారి జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ టెండర్లు పిలిచారు. 10న టెక్నికల్ బిడ్‌లు తెరిస్తేనే ఎవరూ పోటీలో ఉన్నారన్నది తెలుస్తుంది.

>
మరిన్ని వార్తలు