కృష్ణా వరద తగ్గుముఖం

8 Sep, 2017 02:41 IST|Sakshi
కృష్ణా వరద తగ్గుముఖం

►  ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి నీటి విడుదల నిలుపుదల
దిగువకు తగ్గిన ప్రవాహాలు
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై తెలంగాణ తర్జనభర్జన


సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా బేసిన్‌లో గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా స్థిరంగా కొనసాగిన ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక నుంచి జూరాల, శ్రీశైలానికి ప్రవాహాలు తగ్గిపోయాయి. గురువారం ఆల్మట్టికి కేవలం 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా ఆ నీటిని స్వీయ అవసరాలకు మళ్లించారు. అలాగే నారాయణపూర్‌కు 5,947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో 8,049 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో జూరాలకు వరద 20 వేల క్యూసెక్కులకు పడిపోయింది.

ఇందులో నెట్టెంపాడు కాల్వలకు 1,500 క్యూసెక్కులు, భీమా కాల్వలకు 2,100 క్యూసెక్కులు, కోయిల్‌ సాగర్‌ కాల్వలకు 630 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల కుడి, ఎడమ కాల్వల అవసరాలకు మరో 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 26,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి గురువారం ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులకు పడిపోయింది.

ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 33.72 టీఎంసీల నిల్వ ఉంది. మరోవైపు నాగార్జునసాగర్‌ కింద తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలో వపర్‌ స్లూయిస్‌ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువ సాగర్‌కు వదలాలన్న అంశంపై తెలంగాణ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 809 అడుగుల నీటిమట్టంలో 33.72 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో 775 అడుగులకుపైన 13.72 టీఎంసీల మేర నీటిని తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణకు 804 అడుగులకు ఎగువ ఉన్న నీటితో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉండగా 804 అడుగులకు ఎగువన లభ్యత నీరు కేవలం 2.08 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తిపై నీటిపారుదలశాఖ, జెన్‌కో అధికారులు సమావేశమై లభ్యత నీటితో ఎన్ని రోజులపాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు, దిగువకు వచ్చే నీటి పరిమాణం ఎంత, ఎగువ నుంచి ఉన్న ప్రవాహాలు తదితరాలపై చర్చించారు. అయితే లభ్యత నీరు పెరిగితే విద్యుదుత్పత్తి చేద్దామని ఇరువైపుల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. అయినా మరోసారి ఉన్నతస్ధాయిలో చర్చించి తుది నిర్ణ యానికి రానున్నారు.

మరిన్ని వార్తలు