ఇలా ఇంకెన్నాళ్లు..?

31 May, 2016 03:14 IST|Sakshi
పాఠశాలలో మూత్రశాలలు లేక ఆరుబయటకు వెళ్తున్న బాలికలు వీరు.

ఏటా కోట్లు వెచ్చిస్తున్నా సర్కారు బడుల్లో కానరాని వసతులు
6,974 స్కూళ్లలో తాగునీటికి తంటాలు
17,332 పాఠశాలలకు నీటి వసతి కరువు
11,206 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు లేవు
11,937 స్కూళ్లలో కానరాని ఆట స్థలాలు
3,181 విద్యుత్  సరఫరా లేని స్కూళ్లు

 
టాయిలెట్లు, మరుగుదొడ్లు, తాగునీరు,తరగతి గదుల్లేక విద్యార్థుల అవస్థలు
2 వేల స్కూళ్లలో బాలికలకు, 5 వేల స్కూళ్లలో బాలురకు టాయిలెట్లు లేవు

సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ఈ ఫొటోలే నిదర్శనం. ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. కోర్టులు కొరడా ఝళిపిస్తున్నా సర్కారీ బడుల పరిస్థితి మారడం లేదు. ఏళ్లుగా అదే దుస్థితి. తాగునీరు, టాయిలెట్లు, తరగతి గదులు వంటి కనీస వసతులు కరువై ప్రభుత్వ స్కూళ్లు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. అధికారులు కాగితాలపై అన్నీ ఉన్నట్టు చూపుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

వేల పాఠశాలల్లో మరుగుదొడ్లు, టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం లేదు. గోడలు కనిపిస్తే మరుగుదొడ్లు ఉన్నట్టేనని, నల్లా కనిపిస్తే నీళ్లొచ్చినా రాకున్నా మంచినీటి వసతి ఉన్నట్టేనని అధికారులు రికార్డుల్లో రాసేస్తున్నారు. ఫలితంగా అధికారిక లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే ఉండడం లేదు. అనేక స్కూళ్లలో పిల్లలకు చెట్ల పొదలు, రోడ్డు పక్కన గోడలే టాయిలెట్లుగా మారుతున్నాయి! ఒంటికి, రెంటికి సౌకర్యం లేని పాఠశాలల్లో బాలికల కష్టాలైతే చెప్పనలవి కాదు. కేవలం సౌకర్యాలు లే కపోవడం వల్లే ఎందరో బాలికలు చదువులకు మధ్యలో స్వస్తి చెబుతున్నారు. వందల మంది చదువుతున్నా టాయిలెట్లు లే ని స్కూళ్లు ఎన్నో దర్శనమిస్తున్నాయి. టాయిలెట్లు ఉన్నా నిర్వహణ లేక కంపుకొట్టేవే అధికంగా ఉన్నాయి. చాలాచోట్లా విద్యార్థులకు గుక్కెడు మంచినీళ్లు కూడా అందుబాటులో లేవు. అరకొర తరగతి గదులతో వరండాలు, చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు.

భవనాలు లేవు.. తాగునీరు లేదు..
రాష్ట్రంలో మొత్తం 28,707 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 2,116 స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేవు. మరో 5,742 స్కూళ్లలో బాలురకు టాయిలెట్లు లేవు. 6,685 స్కూళ్లలో కామన్ టాయిలెట్స్ లేవు. మిగతా స్కూళ్లలో సగానికిపైగా టాయిలెట్లకు నీటి వసతి లేదు. ఇక 6,974 స్కూళ్లలో తాగునీటి సదుపాయం లేదు. దీంతో ఈ స్కూళ్లలోని పిల్లలు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. మొత్తంగా తాగునీటికి, టాయిలెట్లకు నీటి వసతి కల్పించాల్సిన పాఠశాలలు 17,332 ఉన్నాయి.

3,500 స్కూళ్లకు భవనాలు, అదనపు తరగతులు లేకపోవడంతో చెట్ల కింద, అద్దె భవనాల్లో పిల్లలకు చదువులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్న భోజనం సంగతి సరేసరి. వంట సామగ్రిని దాచేందుకు, వాటిలో చెత్తాచెదారం పడకుండా జాగ్రత్తగా ఉంచేందుకు కిచెన్ షెడ్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ 11,206 స్కూళ్లకు కిచెన్ షెడ్లు లేవు. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. కొన్నిచోట్ల వానొస్తే ఆ రోజు వంటకు చేయకపోవడంతో పిల్లలు పస్తులుండాల్సి వస్తోంది. గాలి, వానల వల్ల బియ్యం, నూనెల్లో చెత్తాచెదారం పడుతుండటంతో అవి కలుషితం అవుతున్నాయి.
 
3,181 స్కూళ్లకు వెలుగు లేదు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు (ఐసీటీ) ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే రాష్ట్రంలో 3,181 స్కూళ్లకు విద్యుత్ కనెక్షన్లే లేవు. ఇక విద్యుత్ కనెక్షన్లు ఉన్న మరో 5 వేల స్కూళ్లలో బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ పాఠశాలల్లో విద్యుత్ వెలుగులు లేవు.. కంప్యూటర్ చదువులూ లేవు!
 
క్రీడలకు ప్రాధాన్యం ఏదీ?

విద్యార్థిలో శారీరక ఎదుగుదలతోపాటు ఆత్మస్థైరానికి దోహదం చేసేవి క్రీడలు. అయినా ఆట స్థలాలు లేక క్రీడలకు పోత్సాహం కరువైంది. రాష్ట్రంలోని 11,937 స్కూళ్లలో ఆట స్థలాలు లేవు. ఫలితంగా ఆ స్కూళ్లలో పిల్లలు ఆటపాటలకు దూరమవుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కొరత ఇదీ..
 
 సదుపాయం                           స్కూళ్లు
 బాలుర టాయిలెట్స్ లేనివి        5,742
 బాలికల టాయిలెట్స్ లేనివి        2,116    
 కామన్ టాయిలెట్లు లేనివి        6,685
 భవనాలు, అదనపు తరగతులు లేనివి    3,500
 నీటి సదుపాయం లేనివి         17,332
 విద్యుత్ సరఫరా లేనివి        3,181
 కిచెన్ షెడ్లు లేనివి            11,206
 ఆట స్థలాలు లేనివి            11,937
 ప్రహరీ గోడలు లేనివి            12,435
 జిల్లాల్లో ఇదీ పరిస్థితి..

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలోని ఓ తరగతి దుస్థితి ఇది. పైకప్పు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరింది. 2015-16 విద్యా సంవత్సరం అంతా విద్యార్థులు ఈ గదిలో బిక్కుబిక్కుమంటూ కూర్చొని చదువుకున్నారు. ఇప్పటికే పరిస్థితి అలాగే ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
 

ఇది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇందులో 109 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నారు. ఐదు తరగతులకు నాలుగు గదులే ఉన్నాయి. అందులో ఒకటి కూలిపోయిన గదిలోనే పాఠాలు చెబుతున్నారు. మరో రెండు తరగతుల విద్యార్థులు అరుబయటే కూర్చుంటారు. పాఠశాలలో బాలికలకు మాత్రమే మూత్రశాలలు ఉన్నా వాటి నిర్వహణ అధ్వానంగా మారింది. బాలురు మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్తున్నారు.  తాగునీటి సదుపాయం కూడా లేదు. వంటగది లేక మధ్యాహ్న భోజనం నిర్వాహకులు నానాపాట్లు పడుతున్నారు.

వరంగల్ జిల్లా జనగామ పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి దుస్థితి ఇది. ఈ పాఠశాలలో దాదాపు అన్ని గదులు ఇలానే ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో పాఠశాల గది పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఒక విద్యార్థి, టీచర్ గాయపడ్డారు. ఆ రోజు నుంచి ఆ గదిలో పాఠాలు బోధించడం లేదు. గదులకు ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.
 

మరిన్ని వార్తలు