లోక్‌సత్తా రద్దు కాలేదు

23 Oct, 2016 03:40 IST|Sakshi
లోక్‌సత్తా రద్దు కాలేదు

ఎన్నికల్లో పోటీ చేస్తాం: పార్టీ తీర్మానం
తాత్కాలిక విరమణే.. నిష్ర్కమణ కాదని వెల్లడి


సాక్షి, హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ రద్దు కాలేదని, ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయాన్ని జాగృతం చేశాక మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఇది తాత్కాలిక విరమణే తప్ప నిష్ర్కమణ కాదని రాజకీయ తీర్మానంలో వెల్లడించింది. గతంలో తృణమూల్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయలేదని, పార్టీగా పుంజుకున్నాక ఎన్నికల్లో పోటీచేసిన విషయాన్ని తీర్మానంలో ప్రస్తావించింది. శనివారం జరిగిన లోక్‌సత్తా పార్టీ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఎన్నికల్లో పోటీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ఓడినంత మాత్రాన మునిగిపోయిందేమీ లేదన్నారు.

మూడు ఎన్నికల్లో పాల్గొన్నామని.. ఓటేయలేదంటూ జయప్రకాశ్ నారాయణ్ ఆగ్రహంతోనో, ఆవేదనతోనో ఇక పోటీ చేయమని ప్రకటించారని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు జేపీ మాట్లాడుతూ.. ‘పోటీ చేద్దామనుకుంటే మీ ఇష్టం. అయితే ఏ లక్ష్యం కోసం చేయదలుచుకున్నారనేది ముఖ్యం’ అన్నారు. ఆగ్రహంతోనో, ఆవేశంతోనో ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దేశంలో ధన రాజకీయాలకు (ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం) తెలుగు గడ్డ పునాది వేసిందని.. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు విస్తరించి జమ్మూకశ్మీర్‌కు కూడా ఈ జాఢ్యం చేరుకుందని జేపీ ధ్వజమెత్తారు.
 
బంగారు తెలంగాణకు జిమ్మిక్కులు పనికిరావు
బంగారు తెలంగాణ దిశలో సాగాలంటే జిమ్మిక్కులు పనికిరావని, నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్‌సత్తా పేర్కొంది. వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన వాగ్దానాలు ప్రభుత్వం అమలుచేయాలని తీర్మానించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోం దని విమర్శించింది. కార్యక్రమంలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షు డు సురేంద్ర శ్రీవాస్తవ, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కన్వీనర్ బండా రు రామ్మోహనరావు, పార్టీ రాష్ట్ర కోశాధికారి పి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు