'100' లక్ష్యం కోసం కష్టపడ్డాం

1 Jun, 2016 00:40 IST|Sakshi
'100' లక్ష్యం కోసం కష్టపడ్డాం

ఎక్కువ శాతం పనులు పూర్తి
ఇది మాకు మేం విధించుకున్న టార్గెట్
జీహెచ్‌ఎంసీ కమిషనర్  జనార్దన్‌రెడ్డి

 

సిటీబ్యూరో: వంద రోజుల ప్రణాళికలో పొందుపర్చిన పనులు పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామని, కొన్ని పనులు నూరు శాతం పూర్తయినా ..కొన్ని   ఆయా దశల్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తిచేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. సాంకేతికంగా వంద రోజుల లక్ష్యానికి తమకు మంగళవారం అర్ధరాత్రి వరకు సమయముందనీ, ఆలోగా మరికొన్ని పూర్తవుతాయని అన్నారు. మంగళవారం సాయంత్రం మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందరోజుల లక్ష్యంపై తమకు ఎలాంటి ఒత్తిడి లేదని, తమకు తాముగా నిర్ణయించుకున్న లక్ష్యమన్నారు. ఏదో ఒక గడువంటూ లేకుంటే తీవ్రజాప్యం జరిగే అవకాశమున్నందున త్వరితంగా పూర్తిచేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకు రాత్రిబంవళ్లు కృషి చేశామని చెప్పారు. ఆయా పరిస్థితులను బట్టి అన్నీ పూర్తిచేయలేకపోయినా, త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. పనులు ప్రారంభించినప్పటినుంచి జోనల్ స్థాయిలో,  క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తగిన చర్యలతో పనులు చేశామని చెప్పారు.
 

చేపట్టిన అన్ని పనులు పూర్తికాకపోయినప్పటికీ, సగటును లెక్కిస్తే మంచి ఫలితమే సాధించామని చెప్పారు. ఆయా స్థానిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలవల్ల కొన్నింట్లో వెనుకబడ్డామని చెప్పారు. జిమ్‌లకు సంబంధించి 20 ప్రాంతాల్లో ఫీజిబిలిటీ లేదని, చెత్తడబ్బాల పంపిణీ మొత్తం పూర్తయినా, వివిధ ప్రాంతాల ప్రజలు తమకు అంద లేదని ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. పనికిరాని వాహనాలను తీసివేయడం సమస్య కాదని, వాటిపై ఆధారపడ్డ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గం చూపేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ఖాళీ ప్రదేశాలకు ప్రహరీల నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వివాదాలున్నాయన్నారు. ఇలా ఆయా అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా పూర్తికానప్పటికీ, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామని కమిషనర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చేయడం ఒక ఎత్తయితే..

 
తిరిగి అక్కడ చెత్తవేయకుండా నిరంతర పర్యవేక్షణ మరో ఎత్తు అంటూ అది ఎంతో క్లిష్టమైన పనే కాక సవాల్‌తో కూడుకున్నదన్నారు. మొత్తం 26 అంశాలకుగాను 16 అంశాల్లో లక్ష్యాన్ని చేరుకున్నామని, మిగతా వాటిల్లో 72-  90 శాతం మేర పనులు  చేశామన్నారు. యువతకు స్వయం ఉపాధి, ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్ల పరిష్కారం, మహిళాసంఘాలకు రుణాల వంటి అంశాల్లో లక్ష్యాన్ని అధిగమించామని చెప్పారు. ఆన్‌లైన్‌లో భవననిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని,  ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన  ఈ- ఆఫీస్ ప్లస్‌ను జూన్2నలేదా ప్రభుత్వ నిర్ణయాని కనుగుణంగా ప్రారంభిస్తామన్నారు. మొబైల్‌యాప్,కన్జర్వెన్స్ పోర్టల్ వంటివి వంద ప్రణాళిక ప్రకటించాకే మొదలుపెట్టి పూర్తిచేయగలిగామన్నారు.  బీటీరోడ్లు 569 పనులకు 526 పనులు చేశామన్నారు. స్వచ్ఛ ఆటోలు ఉన్నప్పటికీ, లెసైన్సులు లేనందున పంపిణీ చేయలేదని చెప్పారు. 317 డీసిల్టింగ్ పనుల్లో 284 చేశామని, జూన్ 12 వరకు వీటికి గడువుందన్నారు. 40 మోడల్ మార్కెట్లకు 4 మాత్రమే పూర్తయ్యాయని, మిగతావి  మరో నెలరోజుల్లో పూర్తిచేస్తామన్నారు.


పబ్లిక్ టాయ్‌లెట్ల నిర్వహణకు సంబంధించి రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. అవసరమైన నీరు, విద్యుత్‌ను కల్పించి, నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని నిర్ణయించామని, త్వరలో ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. ఏ పనులు ఎంతమేర జరిగింది వెబ్‌సైట్‌లో కూడా ఉంచగలమని  ఒక ప్రశ్నకు సమాధానంగా జనార్దన్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అడిషనల్ కమిషనర్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

మరిన్ని వార్తలు