మూడు చోట్ల మాన్యుఫాక్చరింగ్ హబ్‌లు

9 Dec, 2015 01:17 IST|Sakshi
మూడు చోట్ల మాన్యుఫాక్చరింగ్ హబ్‌లు

♦ నేత పాలసీ ముసాయిదాలో ప్రతిపాదన
♦ కొత్త విధానంపై మంత్రి జూపల్లి సమీక్ష
♦ వరంగల్‌లో సమీకృత టెక్స్‌టైల్ హబ్
♦ రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రతిపాదనలు
 
 సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్-2015లో భాగంగా దీనిని రూపొందించారు. రాష్ట్రంలో తెలంగాణ టెక్స్‌టైల్ అప్పరెల్ పాలసీ-2015 పేరిట రూపొందించిన ఈ పాలసీ తొలి ముసాయిదాలోని అంశాలపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పుష్పా సుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, అదనపు ముఖ్యకార్యదర్శి శాంతకుమారి, ఆప్కో డెరైక్టర్ శైలజారామయ్యర్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర నేత పాలసీకి అనుగుణంగా రాష్ట్ర విధానం ఉండాలని పుష్పా సుబ్రమణ్యం సూచించారు. నూతన పాలసీ లక్ష్యాలు, ఉద్దేశాలను ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు వివరించారు. నేత, వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలు అమల్లో ఉంటాయన్నారు. సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా పాలసీ రూపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నేత కార్మికులు సొంత యూనిట్లు స్థాపించేలా ప్రోత్సహించాలన్నారు. తొలి ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి మెరుగులు దిద్దుతామని మంత్రి జూపల్లి ప్రకటించారు.

 వరంగల్‌లో సమీకృత టెక్స్‌టైల్ హబ్
 నేత పాలసీలో భాగంగా రాష్ట్రంలో వరంగల్, సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా), మహబూబ్‌నగర్‌లో టెక్స్‌టైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పత్తి సాగు ఎక్కువగా ఉన్న వరంగల్ కేంద్రంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, జిల్లాలోని నేత పరిశ్రమను ఏకీకృతం చేస్తూ సమీకృత టెక్స్‌టైల్ హబ్ ఏర్పాటు చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులు, కళాకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించాలని, వృత్తిపై ఆధారపడినవారి ఆదాయం పెంచాలనే అంశంపై దృష్టి సారించారు. టెక్స్‌టైల్ రంగంలో స్థానికంగా, విశ్వవ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకునేలా పాలసీని రూపొందించారు.
 
 నూతన పాలసీ ప్రత్యేకతలు
► చేనేత, వస్త్ర పరిశ్రమ కోసం {పత్యేక భూబ్యాంకు
► పరిశ్రమలకు నిరంతరం నీరు, విద్యుత్ సరఫరా
► వస్త్రోత్పత్తిలో వివిధ దశలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు
► నైపుణ్య, సాంకేతిక శిక్షణ, పరిశోధన కోసం ప్రత్యేక కేంద్రం
► వినూత్న డిజైన్లకు రూపకల్పన, వివిధ రకాల ఉత్పత్తులు
► మార్కెట్ అభివృద్ధితోపాటు, ఉత్పత్తుల్లో తెలంగాణ బ్రాండ్‌పై ప్రత్యేకశ్రద్ధ
► టెక్స్‌టైల్ రంగంలో వచ్చే సాంకేతిక మార్పులను ఒడిసి పట్టుకునేలా శిక్షణ
► ప్రస్తుతమున్న కార్యకలాపాల బలోపేతం, ఉత్పత్తులకు మరింత విలువ చేర్చడం
► నూలు, మరమగ్గాలకు ప్రోత్సాహం
► నేత, దుస్తుల తయారీ పరిశ్రమల అనుసంధానం
► నేత యంత్రాల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు

మరిన్ని వార్తలు