-

నేటి నుంచి ధాన్యం కొనుగోలు

18 Oct, 2016 04:43 IST|Sakshi
నేటి నుంచి ధాన్యం కొనుగోలు

మంత్రి ఈటల వెల్లడి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం లెవీని రద్దు చేసినా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాలు నెలకొల్పుతోందని చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1,510, గ్రేడ్-2ధాన్యానికి రూ.1,470 కనీస మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కమిషనర్ సీవీ ఆనంద్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. అనంతరం మం త్రి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ధాన్యం తీసుకున్న మిల్లర్లు 45 రోజుల్లోనే బియ్యాన్ని ఇచ్చేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.   దాదాపు రూ.400 కోట్ల విలువైన బియ్యం రికవరీకి నోటీసులు జారీ చేశామన్నారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఈటల హెచ్చరించారు. బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టుకు తరలించే బ్రోకర్లున్నారని, మిల్లర్ల పేరుతో బ్రోకర్లుగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు.

రేషన్ కార్డులు బియ్యానికి మాత్రమే..
రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమేనని, స్కాలర్‌షిప్పులు, ఆరోగ్యశ్రీ పథకాలకు ఉద్దేశించినవి కావని ఈటల స్పష్టం చేశారు. బియ్యం అక్కర్లేనివారు కార్డులను సరెండర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.  రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ, డీలర్లకు కమీషన్ పెంపు, ఈ పాస్ మిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు