అన్నింటా..బెస్ట్

2 Jun, 2015 00:41 IST|Sakshi
అన్నింటా..బెస్ట్

బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు
పోలీస్ యంత్రాంగంలో కొత్త స్థైర్యం
విస్తృత కార్యక్రమాలతో ప్రజలకు చేరువ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

 
 గచ్చిబౌలి : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే   నక్సలిజం, తీవ్రవాదుల బెడద ఉంటుందని, భూములు కబ్జాలకు గురవుతాయనే అపోహలు సృష్టించారు. అయితే నూతన రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలో ఆ అపోహలన్నీ పటాపంచలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ యావత్ పోలీస్ సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.  నా 24 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖకు ప్రణాళిక బద్దమైన బడ్జెట్, వనరులు, సౌకర్యాలు సమకూర్చారు.సైబరాబాద్ కమిషనరేట్‌లో అనేక  విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ చలానా, మూడు రోజుల్లో పాస్‌పోర్టు వెరిఫికేషన్, వాట్సప్ సౌకర్యం, ీషీ టీమ్స్ ఏర్పాటుతో  పారదర్శకంగా, జవాబుదారితనంతో ఉండేం దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సైబరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్  ‘సాక్షి’తో పేర్కొన్నారు.

పెట్రోలింగ్ వ్యవస్థలో మార్పులు
 60 లక్షల జనాభా, 3,700 కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 వేల మంది పోలీసులు, 2 వేల మంది హోంగార్డ్స్ సేవలందిస్తున్నారు. ప్రతి స్టేషన్‌కు ఐదు ఇన్నోవా కార్లు, బ్లూ కోల్ట్స్ ఇచ్చారు. రాత్రి వేళల్లో సెట్‌లో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలిస్తాం. వాహనాల్లో జీపీఎస్ సిస్టమ్, జాబ్ చార్ట్, పెట్రోల్ సిస్టిమ్‌ను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఆర్‌సీసీ నిఘా ఉంటుంది. దీంతో పది నిమిషాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాం. భూ వివాదాలపై ఎస్‌ఓపీ విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఎస్‌హెచ్‌ఓలు నిబంధనలు తప్పకుండా పాటించాలి.

ఇందుకు సంబందించి ఇప్పటికే 650 కేసులు నమోదు చేశాం. నిబంధనలు పాటించని ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేశాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేశాం. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చలానా చెల్లించవచ్చు. సైబరాబాద్‌లో సరైన అడ్రస్ లేని వాహనాలు ఉండటంతో నగదు చలానాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ట్రాఫిక్ స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజైర్స్, క్రెన్స్ కెమెరా, ట్రాఫిక్ ఆఫీసర్లకు బాడీ కెమెరాలు అమర్చి పారదర్శకంగా పనిచేస్తున్నాం.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి పీఎస్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్, ఐటీ కారిడార్‌లో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. వాట్సాప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటి కే 50 వేల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో ఏ ఘటన జరిగిన సమాచారంతో పాటు ఫోటోలు వస్తాయి. దీంతో అధికారులకు వేగంగా ఆదేశాలు ఇచ్చేందుకు వీలుంటుంది.

మరిన్ని వార్తలు