వస్తోంది.. టాస్!

8 Nov, 2016 01:41 IST|Sakshi
వస్తోంది.. టాస్!

జీహెచ్‌ంఎసీలో కొత్త రకం పన్ను
అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ

సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దైన్యంగా ఉండటంతో వివిధ మార్గాల ద్వారా ఖజానా పరిపుష్టి చర్యలకు సిద్ధమైంది. నిర్మాణ అనుమతుల్లేని అక్రమ భవనాల నుంచి సైతం పన్ను వసూలు చేయాలని భావిస్తోంది. తద్వారా ఏటా రూ. 40 కోట్ల మేర ఆదాయం రానుందని అంచనా వేసింది. ఆస్తి పన్ను తరహాలో కాకుండా  ‘ట్యాక్స్ ఆన్ స్ట్రక్చర్(టాస్)’గా ఈ మెత్తం వసూలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం  టైటిల్‌డీడ్, భవన నిర్మాణ అనుమతులు అన్నీ సక్రమంగా ఉన్న భవనాల నుంచి మాత్రమే ఆస్తిపన్ను  వసూలు చేస్తున్నారు. అనుమతుల మేరకు నిర్మాణం జరిగిందని ధ్రువీకరించే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) ఉన్న భవనాల నుంచే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. అరుుతే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములు, యూఎల్‌సీ,  నాలాలు తదితర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాల నుంచి  ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు.

జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు ప్రతి భవనం నుంచి ఆస్తిపన్ను వసూలు చేసే వెసులుబాటు ఉండటంతో గతంలో అక్రమ నిర్మాణాల నుంచి సైతం ఆస్తిపన్ను వసూలు చేశారు. అరుుతే ఆస్తిపన్ను వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ / వివాదాస్పద భూముల్లో భవనాలు కట్టుకున్నవారు తమకు సదరు భూమిపై హక్కు వస్తుందని భావించే అవకాశం ఉన్నందున దాదాపు ఐదేళ్ల నుంచి ఆ భూముల్లో నిర్మించిన  భవనాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. సదరు భవనాల యజమానులనుంచి జీహెచ్‌ఎంసీ అధికారులు విచ్చలవిడిగా లంచాలకు పాల్పడుతున్నారని విజిలెన్‌‌స నివేదికలు కూడా అందడంతో వాటిపై ఆస్తిపన్ను వసూళ్లను ఆపివేశారు.

న్యూ ఐడియా .. ‘టాస్’!
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ఆదాయ సేకరణకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోన్న అధికారుల కన్ను వాటిపై పడింది. అందరి లాగే వారికి కూడా రహదారులు, పారిశుధ్యం, పార్కులు, ఆటస్థలాలు తదితర సదుపాయాలు కల్పిస్తూ సేవలందిస్తున్నందున  పన్ను వసూలు చేయవచ్చునని భావించారు.

అరుుతే ఆస్తిపన్నుగా వ్యవహరిస్తే.. భూమిపై హక్కు తదితర సమస్యలు తలెత్తనుండటంతో భవనాల్లోని వారికి కల్పిస్తున్న సదుపాయాల పేరిట ‘ట్యాక్స్ ఆన్ స్ట్రక్చర్(టాస్)’గా వసూలు చేయాలని భావిస్తున్నారు. తద్వారా భూమిపై ఎలాంటి హక్కు ఉండదని కూడా వారికి జారీ చేసే నోటీసుల్లో స్పష్టంగా పేర్కొననున్నారు.  యజమానులకు స్థలంపై హక్కు లేనప్పటికీ, భవనాల్లో ఉంటున్నందుకు అందిస్తున్న సేవలకు గాను ఈ ట్యాక్స్‌ను వసూలు చేయవచ్చునని భావిస్తున్నారు.  ఈమేరకు  అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. సదరు స్థలాల్లో సర్వే చేసి ఎన్ని నిర్మాణాలున్నాయో, వాటి ద్వారా ఎంత ఆదాయం రానుందో కూడా అంచనా వేసి నివేదించారు.

అనుమతి రాగానే వసూళ్ల చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. సదరు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేంతదాకా, లేక కూల్చివేసేంత వరకు వాటి నుంచి ఏటా దాదాపు రూ.40 కోట్లు రాగలవని అంచనా వేశారు.  మూడేళ్లకు ముందు నిర్మాణాలు జరిపిన వారికి నూరు శాతం పెనాల్టీ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు