జూరాలకు కొనసాగుతున్న వరద

4 Sep, 2017 04:28 IST|Sakshi
జూరాలకు కొనసాగుతున్న వరద

ఇన్‌ఫ్లో 46,500 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 46,513 క్యూసెక్కులు  

సాక్షి, హైదరాబాద్‌:  జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగ్గి.. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు వరద కొంత తగ్గుముఖం పట్టినా, దిగువన జూరాలకు మాత్రం ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆదివారా నికి జూరాలకు 46,500 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా, అంతే స్థాయిలో నీటిని దిగువ అవసరాలకు వదిలేస్తున్నారు. నాలుగైదు రోజుల క్రితం వరకు ఆల్మట్టికి 56వేల క్యూసెక్కుల వరద ఉండగా, ఆదివారానికి అది 32,730 క్యూసెక్కులకు పడిపోయింది. నారాయణపూర్‌కు సైతం 40 వేల క్యూసెక్కుల నుంచి 33 వేల క్యూసెక్కులకు ప్రవాహాలు తగ్గాయి.

అయినప్పటికీ ఈ రెండు ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు ఆదివారా నికి 46,500 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇందులో 40 వేల క్యూసెక్కులను పవర్‌హౌజ్‌ ద్వారా విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేస్తుండగా, నెట్టెంపాడు కాల్వలకు 1,500 క్యూసెక్కులు, భీమా 2,100, కోయిల్‌సాగర్‌ కాల్వలకు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వల అవసరాలకు మరో 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 46,513 క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. జూరాల నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలానికి 9,718 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదైంది. ప్రస్తుతం శ్రీశైలంలో 25.26 టీఎంసీల నిల్వలున్నాయి.

మరిన్ని వార్తలు