ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు...

15 Jun, 2016 00:12 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రకుమార్ ధ్వజం

 

పంజగుట్ట: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. అన్ని పార్టీల నాయకులనూ పార్టీలో చేర్చుకుని ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారులు, కవులు వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని ఆయన పేర్కొన్నారు. సాంస్కృతిక సారధిలో విధులు నిర్వహిస్తున్న ఎపూరి సోమన్న తన భావాలు చ ంపుకుని అక్కడ ఉండలేక...ఉద్యోగం వదిలి బయటకు రావడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎపూరి సోమన్న సాంస్కృతిక సారథి నుంచి బయటకు వచ్చిన నేపధ్యాన్ని పురస్కరించుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం అబద్ధాలు, మోసాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ .. సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించేందుకు వందలాది కళాకారులు కదలిరావాలని పిలుపునిచ్చారు.


నియోజకవర్గం అభివృద్ధి కోసం  గత్యంతరం లేక టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని నల్లగొండ జిల్లా నాయకులు అంటున్నారని, అధికార పక్షంలో ఉండి కమీషన్లు తీసుకుంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయొచ్చేమో కానీ ప్రశ్నించే ఉద్యమకారులు, విద్యార్థులు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎపూరి సోమన్న మాట్లాడుతూ .. సాంస్కృతిక సారధిలో బానిసగా ఉండలేక బయటకు వచ్చానని తెలిపారు. కవులు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఇకపై బుద్దుడు, అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ పాటలను పాడతానని, సామాజిక హక్కుల కోసం పాటలు పాడతానని పేర్కొన్నారు.

 

ముగిసిన ఓయూ సెట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఈనెల 6న ప్రారంభమైన  ఓయూ సెట్‌ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. 

 

మరిన్ని వార్తలు