వ్యక్తిని పట్టుకుంటే ‘వ్యవస్థ’ గుట్టురట్టు!

7 Apr, 2016 00:53 IST|Sakshi
వ్యక్తిని పట్టుకుంటే ‘వ్యవస్థ’ గుట్టురట్టు!

నకిలీ సర్టిఫికెట్లతో వీసా ఇంటర్వ్యూకు వచ్చిన యువకుడు
కాన్సులేట్ సమాచారంతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
అతడి విచారణలో విక్రయిస్తున్న సంస్థ వ్యవహారం వెలుగులోకి
నల్లగొండ చౌరస్తాలోని కార్యాలయంపై దాడి: నిందితురాలి అరెస్టు

 

సిటీబ్యూరో: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అమెరికా కాన్సులేట్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూకు హారయ్యాడో యువకుడు... ఆ విషయం గుర్తించిన కాన్సులేట్ సిబ్బంది టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు... సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా... అతడికి డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ అమ్మిన సంస్థ వ్యవహారం వెలుగులోకి వచ్చింది... బుధవారం నల్లగొండ చౌరస్తాలోని ఆ సంస్థపై దాడి చేసి చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చంచల్‌గూడకు చెందిన విద్యార్థి మహ్మద్ అఖీల్ అహ్మద్ గతేడాది జూలైలో నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎన్‌సీఐ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ స్టడీస్ సంస్థను సంప్రదించాడు. అమెరికా వెళ్లేందుకు తనకు బీఎస్సీ (ఐటీ) డిగ్రీ సర్టిఫికెట్ పాత తేదీలతో కావాలని కోరాడు. దీనికి అంగీకరించిన సంస్థ నిర్వాహకుడు వారణాసిలోని మహాత్మాగాంధీ కృషి విద్యాపీఠ్ పేరుతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు.


అడ్డంగా దొరికిన అఖీల్...
ఈ సర్టిఫికెట్లతో అఖీల్ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటర్వ్యూ నిమిత్తం మంగళవారం బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వచ్చాడు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన కాన్సులేట్ అధికారులు డిగ్రీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు నకిలీవిగా గుర్తించారు. టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి... అఖీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తాను నల్లగొండ చౌరస్తాలో ఉన్న ఎన్‌సీఐ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ స్టడీస్ నుంచి సదరు సర్టిఫికెట్లు ఖరీదు చేశానని చెప్పాడు.  దీంతో ఎస్సైలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డిలతో కలిసి సిటీ టవర్స్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. ఈ సంస్థ చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ (సీఓఓ) అఫ్షాన్ సిద్ధిఖీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ యజమాని మహ్మద్ హయత్ హుస్సేన్ పరారయ్యాడు. సంస్థ కార్యాలయం నుంచి 83 నకిలీ సర్టిఫికెట్లు, వీటి తయారీకి వినియోగించే కంప్యూటర్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అఫ్షాన్ సిద్ధిఖీ ఎన్‌సీఐ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ స్టడీస్‌లో ఎనిమిది నెలలుగా సీఓఓగా పని చేస్తున్నట్లు వెల్లడైంది.

 
ఎనిమిది విశ్వవిద్యాలయాల పేర్లతో...

అఫ్షాన్ సిద్ధిఖీ తన యజమాని హుస్సేన్‌తో కలిసి ఛత్రపతి షాహూజీ యూనివర్శిటీ (కాన్పూర్), భర్ఖతుల్లా విశ్వవిద్యాలయ (భోపాల్), రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ (కర్ణాటక), మహారాణి రామేశ్వ రి ఆయుర్వేదిక్ కాలేజ్ (దర్భంగా, బీహార్), శివాజీ యూనివర్శిటీ (గ్వాలియర్), బుందేల్‌ఖండ్ యూనివర్శిటీ (ఝాన్సీ), మహాత్మా గాంధీ కృషి విద్యాపీఠ్ (వారణాసి), గ్లోబల్ యూనివర్శిటీ (నాగాలాండ్) పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో పాటు తమకు నాగాలాండ్‌లోని గ్లోబల్ యూనివర్శిటీతో ఒప్పందం ఉందంటూ డిగ్రీకి రూ.40 వేలు, పీజీకి రూ.45 వేలు ఫీజు వసూలు చేసి, విద్యార్థులతో కార్యాలయంలోనే పరీక్షలు రాయిం చి నకిలీ సర్టిఫికెట్లు అంటగడుతున్నా రు. అఖీల్, అఫ్షాన్‌లను బేగంపేట పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్ పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తోంది.

 

>
మరిన్ని వార్తలు