రాఘవేంద్రరావుపై దాడి చేసిన వ్యక్తికి జైలుశిక్ష

10 Jun, 2016 16:32 IST|Sakshi

ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై దాడి చేయడమే కాకుండా ఆయనకుచెందిన ఖరీదైన కార్లను ధ్వంసం చేసిన ఘటనలో వల్లిపి రవీంద్ర(28)కి నాంపల్లిలోని మూడవ అదనపు న్యాయస్థానం రెండువారాల జైలు శిక్ష విదిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడిని శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో హాజరుపర్చగా ఈ మేరకు కోర్టు తీర్పు అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.



అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లి గ్రామానికి చెందిన రవీంద్ర గురువారం ఉదయం ఫిలింనగర్ సైట్-2లో నివసించే దర్శకుడు రాఘవేంద్రరావు నివాసానికి వెళ్లి ఆయన బయటకు వెళ్లిన సమయంలో కారును అడ్డగించి దాడికి యత్నించాడు. 2006లో తీసిన శ్రీరామదాసు సినిమా కథ తనదేనని ఆ కథ స్క్రిప్ట్‌ను పోస్టులో పంపించానని అయితే కథ పేరు తనకు బదులుగా వేరొకరిని చేర్చారని నిలదీశారు. రాఘవేంద్రరావు సర్దిచెప్తున్నా వినకుండా ఆయన కారు అద్దాలు కొడుతూ దాడికి యత్నించాడు.



 రవీంద్ర నుంచి తప్పించుకొని రాఘవేంద్రరావు వెళ్లిపోయారు. అనంతరం ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ రాడ్ తీసుకొని రాఘవేంద్రరావు ఇంట్లోకి ప్రవేశించిన రవీంద్ర అక్కడున్న ఆడి, బెంజ్, సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డు వచ్చిన వాచ్‌మెన్ కె. బాబుపై దాడి చేశాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి వస్తున్న రాఘవేంద్రరావు కొడుకు కోవెలమూడి ప్రకాశ్‌రావుపై కూడా దాడి చేశారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో రవీంద్ర ఆ సినిమా కథ తనదేనని పలుమార్లు రాఘవేంద్రరావును ప్రశ్నించడం జరిగిందని న్యాయం జరగలేదని అందుకే అందరి దష్టికి ఈ విషయం వెళ్లాలని దాడి చేశానని వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు