క్యాన్సర్‌ పేరుతో నాటకం

8 Apr, 2017 01:41 IST|Sakshi

రూ. కోటి వసూలుచేసి పరారైన యువతి

బంజారాహిల్స్‌: తనకు క్యాన్సర్‌ ఉందని నయం కావాలంటే ఆపరేషన్‌కు రూ లక్షలు ఖర్చవుతుందని, అంత డబ్బు తన వద్ద లేనందున మృత్యువుకు చేరువవుతున్నానంటూ మాయమాటలు చెప్పి స్నేహితులను, స్వచ్ఛంద సంస్థలను మోసం చేసిన కిలాడి లేడిపై బంజారా హిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరా కథనం మేరకు .. గత ఫిబ్రవరి 10న సమియ అబ్దుల్‌ హఫీజ్‌(22) అనే యువతి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఒమేగా క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లి ఎండి మోహన్‌ వంశీని కలిసి తన తండ్రికి క్యాన్సర్‌ ఉందని నయం కావడానికి చికిత్స వివరాలు చెప్పాలని కోరింది.

అందుకు మోహన్‌వంశీ మీ తండ్రిని తీసుకొని వస్తే పరీక్షించి చెబుతామంటూ చెబుతుండగానే డాక్టర్‌ ఫొటోలు, వీడియోలు కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాతి రోజు సమియా తనకు క్యాన్సర్‌ ఉందని డాక్టర్‌ మోహన్‌వంశీతో మాట్లాడగా లక్షలు ఖర్చవుతాయని చెప్పారని పేర్కొంటూ.. ఫేస్‌బుక్‌లో ఆయనతో ఉన్న ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేసింది. పథకంలో భాగంగా స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలకు ఫొటోలు పంపించింది.

వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లను కూడా జత చేస్తూ దాతలు గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీహెచ్‌ ఖాతాలో విరాళాలు జమ చేయాలని కోరింది. దీంతో దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె స్నేహితులు సొమ్మును సేకరించి రూ.40 లక్షల వరకు ఆమె ఖాతాలో డిపాజిట్‌ చేశారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు పంపాయి. గత నెల 29న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో ఆమెను పరామర్శించేందుకు దుబాయ్‌ నుంచి వచ్చిన స్నేహితులు ఓమెగా ఆస్పత్రికి వెళ్లి సమియా కోసం ఆరా తీయగా ఆ పేరుతో ఎవరూ లేరని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మరింత లోతుగా విచారిస్తే క్యాన్సర్‌రోగిగా నమ్మించి డాక్టర్‌తో పాటు స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలను బురిడి కొట్టించినట్లు తేలడంతో స్నేహితురాలు ఫాతిమా, ఓమెగా ఆస్పత్రి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రాజారాం నరేంద్ర బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నాటకం ద్వారా నిందితురాలు సమియా దాదాపు రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు తేలింది. బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు సమియా కోసం గాలింపు చేపట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు