నేడో రేపో ‘రెండు’!

22 Jun, 2016 23:29 IST|Sakshi

సైబరాబాద్ కమిషనరేట్ విభజన ప్రక్రియ కొలిక్కి
సిబ్బందితో పాటు సామగ్రి కూడా విభజన
సీఎం వద్ద దస్త్రం,  త్వరలో ఉత్తర్వులు

 

సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్‌లుగా విభజింజే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదనలపై ఈ నెలాఖరు లోపే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. విభజన నేపథ్యంలో సిబ్బందితో పాటు కుర్చీల దగ్గరి నుంచి చివరకు పోలీసు జాగిలాల దాకా...ఇలా ప్రతిదీ నిర్ణీత నిష్ఫత్తిలో పంపిణీ చేశారు. అన్ని ఠాణాలతో కూడిన జోన్‌లతో పాటు నేరగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగే స్నిఫర్ డాగ్స్‌ను కూడా విభజించారు. సైబరాబాద్ పోలీసుల చేతుల్లో ఉన్న 12 డాగ్స్‌ను ఒక్కో కమిషనరేట్‌కు ఆరు చొప్పున కేటాయించారు. దాదాపు 1,300కు పైగా వాహనాలను రెండు కమిషనరేట్లకు సగం చొప్పున పంపిణీ చేయాలని లెక్కలతో సహా చూపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయుధాలతో  పాటు కమ్యూనికేషన్ ఉపకరణాలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫర్నీచర్, కేబుల్, ఇతర మెటీరియల్ ఇలా ప్రతిదీ రెండిటికీ పరిధిని బట్టి కేటాయించారు.

 
సిబ్బంది విభజించిన లెక్కలివీ...

ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మినిస్టీరియల్ సిబ్బంది 40 మంది వరకు ఉన్నారు. సీసీఆర్‌బీలో 20 మంది, కంట్రోల్ రూమ్‌లో 50 మంది, అకౌంట్ సెక్షన్ 10 మంది వరకు ఉన్నారు. వీరందరినీ రెండు కమిషనరేట్లకు చెరి సగం చొప్పున కేటాయించారు. ఆర్మ్‌డ్ రిజర్వులో 1200, స్పెషల్ బ్రాంచ్‌లో 60, సైబర్‌క్రైమ్, సీఎస్‌ఎల్, సీటీసీలో ఉన్న 100 మందిని కూడా విభజించిన పోలీసు ఉన్నతాధికారులు వారికిష్టమున్న కమిషనరేట్‌ను ఎంచుకునే అప్షన్‌ను ఇప్పటికే కల్పించారు. నేరాల దర్యాప్తునకు ఎటువంటి ఆటంకం కలిగించొద్దనే ఉద్దేశంతో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న 3,500 మందిని యథాతథా స్థానంలో కొనసాగిస్తే బాగుం టుందని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో రీ ఆర్గనైజింగ్ వింగ్ పేర్కొంది. అలాగే ట్రాఫిక్‌లోని 500 మంది, హోంగార్డులు 2,000 మంది ఎక్కడున్నవారు అక్కడి స్థానాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్‌లతో ఈస్ట్ కమిషనరేట్, శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో వెస్ట్ కమిషనరేట్‌లుగా విభజిస్తూ రీ ఆర్గనైజింగ్ వింగ్ పంపిన ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఈ నెల 27 వరకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని మూడు, నాలుగు అంతస్తులను పూర్తిచేయాలని ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. ఆలోపు సైబరాబాద్ విభజనపై ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశముందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 
కమిషనరేట్ల స్వరూపమిదే...

ప్రస్తుతమున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లు ఉన్నాయి. అయితే విభజన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో రెండు కమిషనరేట్లలో మూడు జోన్లు ఉండాలనే ఉద్దేశంతో  ఈస్ట్ కమిషనరేట్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్‌బీనగర్ జోన్లతో కొత్తగా భువనగిరి జోన్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్‌లతో వెస్ట్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలన్న రీ ఆర్గనైజింగ్ వింగ్ అధికారులు శంషాబాద్ జోన్‌లో షాద్‌నగర్ డివిజన్‌ను, మాదాపూర్ జోన్‌లో మియాపూర్ డివిజన్లను కొత్తగా చేర్చారు. ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉండగా...విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగు ట్రాఫిక్ ఠాణాలు ఏర్పాటుచేయనున్నారు. ఈస్ట్ కమిషనరేట్‌లో భువనగిరి, చౌటుప్పల్, వెస్ట్ కమిషనరేట్‌లో షాద్‌నగర్, చేవేళ్ల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విభజన ప్రభావంతో రెండు కమిషనరేట్లలో వం దల సంఖ్యలో సిబ్బంది అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు