ఆ పని చేసింది అతని రెండో భార్యే

24 Dec, 2015 00:25 IST|Sakshi
ఆ పని చేసింది అతని రెండో భార్యే

బీదర్‌లో సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు
‘ట్రాన్స్‌పోర్టర్’ ద్వారా నగరానికి తరలింపు
ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే టకీ ఇల్లు

 
 సిటీబ్యూరో:  సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీ సులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్రాష్ట్ర నేరగాడు టకీ అలీకి నైతిక మద్దతు ఇస్తున్నది అతడి రెండో భార్యేనని పోలీ సులు చెప్తున్నారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన టకీ.. ముఠా ఏర్పాటు చేసి ఓ పక్క చైన్‌స్నాచింగ్స్, మరోపక్క సూడో పోలీసు నేరాలతో దేశ వ్యాప్తంగా ఏడు నగరాల్లో హల్‌చల్ చేస్తుంటాడని తెలిపారు. బీదర్‌లోని ఇరానీ గల్లీలో ఉన్న హుస్సేనీ కాలనీకి చెందిన టకీ అలీ మహారాష్ట్రకు చెందిన యువతిని మొదట వివాహం చేసుకున్నాడు. ఇతడి వ్యవహారశైలి తెలి సిన ఆమె విడాకులు తీసుకుని ముంబైలో స్థిరపడింది. దీంతో టకీ తమ ప్రాంతానికే చెందిన షకైనా అలి యాస్ లాలను రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసుల వేట నుంచి తప్పించుకోవడానికి ఉత్తప్రదేశ్‌లోని లక్నోతో పాటు ఢిల్లీ, అజ్మీర్, భోపాల్‌ల్లోనూషెల్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు.

‘ట్రాన్స్‌పోర్టర్ల’ ద్వారా వాహనాలు...
నిఘా కంట్లో పడకుండా ఉండటానికి తరచు మకాంతో పాటు సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు మార్చేటకీ... ఫోన్ ద్వారా కేవలం తన భార్య లాలతో మాత్రమే సంప్రదింపులు జరుపుతాడు. ప్రతి నెల రోజులకు, అనుమానం వస్తే తక్షణం వీరిద్ద రూ తమ ఫోన్లు, సిమ్‌లను ధ్వంసం చేసి, కొత్తవి వినియోగిస్తారు. టకీ ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేశాక ఆ విషయంతో పాటు ఏ రోజు నుంచి పంజా విసరాలనేది ఫోన్ ద్వారా భార్యకు చెప్తాడు. ఆమె ఇరానీ గల్లీలో ఉండే అలీ అనుచరుల్ని అప్రమత్తం చేస్తుంది. బీదర్‌లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్ నుంచి పల్సర్, కరిజ్మా వంటి హైస్పీడ్ వాహనాలను ఖరీదు చేస్తుంది. వీటిని టకీ చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లడానికి స్థానికుల్ని ట్రాన్స్‌పోర్టర్స్‌గా వాడుకుంటుంది. టకీకి వాహనాలను అప్పగించి వచ్చినందుకు ఈ ‘ట్రాన్స్‌పోర్టర్స్’కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తుంది.
 
నాలుగైదు రోజులు... 20-50 తులాలు...

 టకీ విమానంలో ఆ ప్రాంతానికి చేరుకోగా... మిగిలిన గ్యాం గ్ మెంబర్స్ బస్సు, రైళ్లల్లో వస్తారు. అంతా కలిసి లాడ్జీలు, చిన్న హోటల్స్‌లో షెల్టర్ తీసుకుంటారు. లాల పంపిన ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వరుసపెట్టి చైన్‌స్నాచింగ్స్, అటెన్షన్ డైవర్షన్లు చేస్తారు. ఓ ప్రాంతంలో కేవలం నాలుగైదు రోజుల మాత్రమే ఉండి ‘పని’ చేసే టకీ గ్యాంగ్ కనిష్టంగా 20 తులాలు, గరిష్టంగా 50 తులాల బంగారం తస్కరిస్తుంది. ఈ సొత్తులో తన వాటా తీసుకుని టకీ విమానంలో ఎగిరిపోగా... మిగతా వారు ద్విచక్ర వాహనాలను అక్కడి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోని పార్కింగ్స్‌లో పెట్టి బీదర్ వచ్చేస్తారు. మరోసారి అదే ప్రాంతానికి వెళ్లినప్పుడు పార్కింగ్స్‌లోని వాహనాలను తీసుకుని పంజా విసురుతారు. ఒక్కరోజులో కనీసం ఆరు నేరాలు చేస్తారు.

అవాక్కైన బెంగళూరు సీసీబీ కాప్స్...
కర్ణాటకలోని బెంగళూరులో మధ్య వయస్కులైన మహిళల్ని టార్గెట్‌గా చేసుకుని, అటెన్షన్ డైవర్షన్లతో రెచ్చిపోయిన టకీ అలీ గ్యాంగ్ అక్కడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. 2011లో హుస్సేనీకాలనీకి చెందిన 26 మందితో ముఠా కట్టిన టకీ బెంగళూరులో 55 నేరాలు చేశాడు/చేయించాడు. రంగంలోకి దిగిన అక్కడి సీసీబీ పోలీసులు ఎట్టకేలకు 2012 ఫిబ్రవరిలో వీరిని పట్టుకుని రూ.65 లక్షల సొత్తు రికవరీ చేశారు. 26 మందితో ఎనిమిది గ్యాంగులు ఏర్పాటు చేసిన టకీ సీబీఐ, సీఐడీ అధికారులమంటూ మహిళలకు జాగ్రత్తలు చెప్తూ, వారి నుంచి బంగారం కాజేసే విధానం తెలుసుకుని సీసీబీ అధికారులు అవాక్కయ్యారట.
 
అత్యంత విలాసవంత జీవితం...
గ్యాంగ్ లీడర్ టకీ అలీతో పాటు అతడి భార్యదీ విలాసవంతమైన జీవితమే. హుస్సేనీకాలనీలో లాల నివసించే ఇంటితో పాటు లక్నోలో టకీ ఖరీదు చేసిన ఇల్లూ అణువణువూ సెంట్రల్ ఏసీతో ఉంటుందని చెప్తున్నారు. ఫైవ్‌స్టార్ హోటళ్లను తలపించేలా ఇంటి లోపలి డెకరేషన్ ఉంటుం దట. వీరు ఎక్కడకు వెళ్లినా విమానాల్లోనే తిరుగుతారని, బస చేసేది కూడా ఖరీదైన హోటళ్లలోనేనని పోలీసులంటున్నారు. టకీ గ్యాంగ్ కోసం సైబరాబాద్ పోలీసులు ఈ ఏడా ది అక్టోబర్ 7న ఆపరేషన్ ప్రారంభించారు. లక్నో నుంచి ఢిల్లీకి, అక్కడ నుంచి అజ్మీర్‌కు టకీ పారిపోతూ తప్పించుకోగా... సల్మాన్ బీదర్ నుంచి ఒడిశా, అట్నుంచి రాజస్థాన్ సర్వర్ ప్రాంతానికి జారుకున్నాడు. ఇక సలాల్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పారిపోయాడు. 75 రోజుల ముమ్మర వేట తరవాత పోలీసులు వీరిని పట్టుకోగలిగారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా