పర్సులొద్దు... సెల్‌ఫోన్లే ముద్దు!

28 May, 2016 00:10 IST|Sakshi
పర్సులొద్దు... సెల్‌ఫోన్లే ముద్దు!

రౌడీల నేతృత్వంలో రెచ్చిపోతున్న   పిక్ పాకెటింగ్ గ్యాంగ్
రద్దీ బస్సుల్లో పంజా ఐదుగురిని అరెస్టు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్
దొంగ ఫోన్లు కొంటున్న ఇద్దరు రిసీవర్లూ అరెస్టు

 

సిటీబ్యూరో:  ఒకప్పుడు నగరంలోని పిక్‌పాకెటింగ్ ముఠాలు పర్సుల్ని టార్గెట్ చేసేవి. అయితే, ప్లాస్టిక్ కరెన్సీగా పిలి చే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో పర్సులతో ‘గిట్టుబాటు’ కాక.. ఈ ముఠాలు ఇటీవల పర్సుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డాయి. ఈ తరహాలో వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఐదుగురు దొంగలతో పాటు వీరి నుంచి చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న ఇద్దరు రిసీవర్లనూ కటకటాల్లోకి పంపారు. మరో ఇద్దరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు.  డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...

 
ఇద్దరు రౌడీషీటర్లు...

ఆసిఫ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ అలియాస్ కుల్చాన్ యూసుఫ్ నేతృత్వంలో ఈ ముఠా పని చేస్తోంది. ఇతడిపై నగరంలోని అనేక ఠాణాల్లో కేసులున్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ నూర్ ముఠా ‘కార్యకలాపాలను’ పర్యవేక్షిస్తుంటాడు. రేతిబౌలి, మెహిదీపట్నం, హుమాయున్‌నగర్, పంజగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, లక్డికాపూల్ వంటి రద్దీ రూట్లలో తిరిగే బస్సుల్నే వీరు టార్గెట్ చేస్తారు. టోలిచౌకీకి చెందిన మహ్మద్ జకీర్ అలీ, మాసబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ షెహన్‌షా, బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్ అస్లం, పహాడీషరీఫ్‌కు చెందిన ఉస్మాన్, రాజేంద్రనగర్‌కు చెందిన షఫీ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు రౌడీషీటర్లూ ఎప్పుడూ నేరుగా రంగంలోకి దిగి నేరం చేయరు. వెనుక ఉండి ముఠా సభ్యుల ద్వారా వ్యవహారాలు నడుపుతారు.

 
హడావుడి చేసేది ‘ఆడి’... కొట్టేసేది ‘షాను’...
ఈ పిక్ పాకెటింగ్ ముఠాకు ప్రత్యేక పారిభాషిక పదాలు కూడా ఉన్నాయి. మొదట గ్యాంగ్‌లోని నలుగురు సభ్యులు రద్దీగా ఉన్న బస్సు ఎక్కుతారు. ఈ బస్సును ముఠాలో మరికొందరు ఆటో లేదా బైక్‌పై అనుసరిస్తారు. బస్సెక్కిన ముఠా సభ్యులు ఒక ప్రయాణికుడిని టార్గెట్ చేసి.. అతడి వద్దకు చేరతారు. వీరిలో ఇద్దరు ‘టార్గెట్’ చుట్టూ చేరి హడావుడి చేసి. ఉత్కంఠ వాతావరణం కలిగిస్తారు.  ఇలా చేసే వారిని ‘ఆడి’గా పిలుస్తారు. బస్సులోనే ఉన్న మరో ముఠా సభ్యుడు తమ ‘టార్గెట్’ నుంచి సెల్‌ఫోన్‌ను చోరీ చేస్తాడు. ఇతడిని ‘షాను’ అని పిలుస్తారు. కావాల్సింది చేతి కందగానే ‘షాను’ అదే బస్సులో ఉన్న నాలుగో ముఠా సభ్యుడికి దాన్ని అందించేస్తాడు. అతడు వెంటనే బస్సు దిగిపోయి వెనుకే ఫాలో అవుతున్న తమ వాహనం ఎక్కేస్తాడు. సాధారణంగా షఫీ, షెహన్‌షా ‘ఆడి’ పాత్రను, ఉస్మాన్ ‘షాను’ పాత్రను పోషిస్తారు. మిగిలిన వారు బస్సులో ఉండి, వెనుక వస్తూ సహకరిస్తారు.

 
జగదీష్ మార్కెట్‌లో అమ్మేసి పంపకాలు...

ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సుల్లో చోరీ చేసిన ఫోన్లను ముఠా సభ్యులు సయ్యద్ నూర్‌కు అప్పగిస్తారు. అతడు వాటిని చింతల్‌మెట్‌కు చెందిన షేక్ వాజిద్ ద్వారా జగదీష్ మార్కెట్‌లో సెల్‌ఫోన్ల వ్యాపారం చేస్తున్న సుల్తాన్ బిన్ మహ్మద్‌కు విక్రయిస్తాడు. అలా వచ్చిన మొత్తంలో ‘షాను’కు రూ.1500, ‘ఆడి’లకు రూ.700 చొప్పున, అస్లాంకు రూ.500 ఇచ్చే నూర్ తాను రూ.2 వేలు తీసుకుంటాడు. ఇవి వీరి రోజు కూలీ మొత్తాలన్న మాట. మిగిలిన మొత్తాన్ని తీసుకుని అర్ధరాత్రి వేళ చింతల్‌మెట్‌లో ఉన్న యూసుఫ్ హోటల్‌కు వెళ్లే నూర్ అతడికి అందించి వస్తాడు. ఇటీవల కాలంలో ఎస్సార్‌నగర్, పంజగుట్ట, నాంపల్లి ఠాణాల పరిధిలో 10 నేరాలు చేసిన ఈ ముఠాపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది.

 
బయటపడినవే చాలా తక్కువే...

దీంతో ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్‌లతో పాటు పంజగుట్ట డీఐ, డీఎస్సైలు బి.లక్ష్మీనారాయణరెడ్డి, ఎం.శివకుమార్ తమ బృందాలతో వలపన్నారు. శుక్రవారం యూసుఫ్‌తో జకీర్, నూర్, షెహన్‌షా, అస్లం, వాజిద్, సుల్తాన్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీ సొత్తు అయిన 10 ఖరీదైన సెల్‌ఫోన్లతో పాటు బస్సును ఫాలో చేయడానికి వినియోగించే బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో చోరీ చేసిన తర్వాత దిగడం కుదరకపోతే... అందులోనే సెల్‌ఫోన్‌ను పడేస్తారని, ఆపై వీరే దాన్ని యజమానికి చూపించి తీసుకునేలా చేసి తప్పించుకుంటారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న ఉస్మాన్, షఫీ కోసం గాలిస్తున్నారు. వీరు చేసిన నేరాలు అనేకం ఉన్నా కేసులు నమోదైనవి తక్కువేనని, బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

 

మరిన్ని వార్తలు