కరెన్సీ రద్దు వల్ల ప్రయోజనం ప్రశ్నగానే మిగిలింది

3 Dec, 2016 01:40 IST|Sakshi
కరెన్సీ రద్దు వల్ల ప్రయోజనం ప్రశ్నగానే మిగిలింది

కేంద్రం చర్యలను తప్పుబట్టిన ప్రొఫెసర్ హరగోపాల్
 
 హైదరాబాద్: కరెన్సీ రద్దు వల్ల ప్రయోజనం ఏమిటనేది ప్రశ్నగానే మిగిలిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనాన్ని అరికట్టడం అటుంచితే సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ’పెద్ద నోట్ల రద్దు నల్లధనం రద్దుకేనా’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హరగోపాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రయోజనాల కోసమే మన దేశ కరెన్సీని రద్దు చేశారనే అనుమానం కల్గుతోందని విమర్శించారు.

కార్పొరేటర్ శక్తులను కాదని నిర్ణయాలు తీసుకునే శక్తి పాలకులకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ చక్రధర్ రావు మాట్లాడుతూ నల్లధనం సమస్య 1950 సంవత్సరంలోనే ప్రారంభమైందని అన్నారు. నల్లధనం ఉన్నవారు మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడటం లేదనీ దాన్ని వ్యూహత్మకంగా బయటికి తీసుకురాకుండా నోట్లను రద్దు చేయటం సరికాదన్నారు.విరసం నేత వరవర రావు మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల అవినీతిని అరికట్టలేరని, ఎందుకంటే బిజేపి ప్రభుత్వం అవినీతి పునాదులమీదనే నిర్మాణం అరుుందని విమర్శించారు. ఇంకా ప్రొఫెసర్ రామకృష్ణ, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ కేంద్రం చర్యలను విమర్శించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి, ప్రొఫెసర్ ముత్యం రెడ్డి, నలమాస కృష్ణ, డాక్టర్ కె.శ్రీనివాస్, ఎ.రాజేంద్రబాబు, డాక్టర్ రమణమూర్తి, ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు