నిరీక్షణ ఫలించింది...

30 Mar, 2016 04:32 IST|Sakshi

♦ సత్ప్రవర్తన కలిగిన 251 మంది ఖైదీల విడుదల
♦ గవర్నర్ ఆమోదంతో విముక్తి
 
 సాక్షి, హైదరాబాద్: క్షమాభిక్ష కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఖైదీల నిరీక్షణ ఫలించింది. సత్ప్రవర్తన కలిగిన 251 మంది ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి క్షమాభిక్ష ఖైదీలు విడుదలయ్యారు. ఐదేళ్ల తర్వాత క్షమాభిక్షకు నోచుకుని ఖైదీలు విడుదల కావడంతో అన్ని జైళ్ల వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విడుదలైన వారిలో 190మంది జీవిత ఖైదీలు, 61 మంది సాధారణ ఖైదీలు ఉన్నారు. అత్యధికంగా వరంగల్ కారాగారం నుంచి 70 మంది విడుదలయ్యారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 48మంది, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం (ఓపెన్‌జైలు)-39, చంచల్‌గూడ-9, మహిళా జైలు చంచల్‌గూడ-26, సంగారెడ్డి-6, మహబూబ్‌నగర్-7, నల్లగొండ-6, వరంగల్-70, ఆదిలాబాద్-8, నిజామాబాద్-17, కరీంనగర్-7, ఖమ్మం-8 మంది విడుదలయ్యారు.

 రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే ప్రథమం
 ఉమ్మడి రాష్ట్రంలో 17సార్లు క్షమాభిక్ష ప్రసాదించారు. మాజీ సీఎం ఎన్‌టీఆర్ హయాంలో, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వైఎస్ మరణానంతరం చివరగా 2011లో కొన్ని నేరాలకు మినహాయింపు ఇచ్చి కొంతమంది ఖైదీలను మాత్రమే క్షమాభిక్షపై విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్షమాభిక్ష ఖైదీలు విడుదల కావడం ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు