గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది సస్పెన్షన్

1 Mar, 2016 02:27 IST|Sakshi
గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది సస్పెన్షన్

♦ రెండు పూటలా బడ్జెట్ సమావేశాలు
♦ ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు నో
♦ సభలోకి ప్లకార్డులను అనుమతించేది లేదు
♦ అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
 
 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని, సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని శాసనసభ రూల్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన స్పీకర్ చాంబర్‌లో సోమవారం రూల్స్ కమిటీ సమావేశం జరిగింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, టీడీపీ నుంచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే వివేకానంద భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ సమావేశాలను రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల దాకా రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య రగడ జరుగుతోంది. ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేద ని రూల్స్ కమిటీకి ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

బడ్జెట్ సమావేశాలను అర్థవంతంగా నిర్వహించేందుకు ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని, ప్రశ్నోత్తరాలను సాగదీయ వద్దని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానంగా సభలోకి ప్లకార్డులను తీసుకురావడాన్ని నిషేధించారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను పూర్తిగా డిజిటలైజ్డ్ (పేపర్‌లెస్) సెషన్‌గా జరపాలని... ఈ విధానం ఇప్పటికే అమలవుతున్న గోవా, హర్యానా అసెంబ్లీలను సందర్శించి ఆ పద్ధతులను అధ్యయనం చేయాలని, అసెంబ్లీ గ్రంథాలయాన్ని కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వేతనాల పెంపుపైనా సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

మరిన్ని వార్తలు