మూడు నెలల ఆడశిశువు విక్రయం!

19 Jun, 2016 03:25 IST|Sakshi
మూడు నెలల ఆడశిశువు విక్రయం!

విచారణ జరుపుతున్న ఐసీడీఎస్ అధికారులు
 
 హైదరాబాద్: మూడు నెలల పసిగుడ్డును బేరానికి పెట్టాడో తండ్రి. మధ్యవర్తి ప్రమేయంతో శిశువును అడిగిన వారికి అప్పగించాడు. స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్ అధికారులు శనివారం దీనిపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో బిడ్డను విక్రయించి నట్టు వారు అంచనాకు వచ్చారు.

 కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌కి చెందిన మాలోత్ రవీందర్‌నాయక్‌కు మెదక్‌జిల్లా రామాయంపేట మండలం కౌడిపల్లి గ్రామానికి చెందిన అంజలితో 2014లో పెళ్లయింది. వీరికి మొదటి కాన్పు(2015)లో కుమార్తె జన్మించింది. ఈ ఏడాది మార్చి 14న రెండో కాన్పులోనూ ఆడ బిడ్డే పుట్టింది. సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అంజలి ప్రసవించిన సమయంలో వీరికి రామాయంపేట లక్ష్మీపురం గ్రామానికి చెందిన రజితతో పరిచయమైంది. తనకు పిల్లలు లేరని, మీ బిడ్డను ఇస్తే పెంచుకుంటానని రజిత వారితో చెప్పింది. అనంతరం వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్లిపోయారు.

కాగా, ఏప్రిల్ 10న వారి బంధువు మధు మధ్యవర్తిత్వంతో రజితకు చిన్నారిని రవీందర్ అప్పగించాడు. స్థానికులు శిశువును విక్రయించారని ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన ఐసీడీఎస్ మేడ్చల్ సూపర్‌వైజర్ స్పందన, చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి లావణ్యరెడ్డి శనివారం రవీందర్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బిడ్డను ఎందుకు విక్రయించారని నిలదీయగా తెలిసినవారికి దత్తత ఇచ్చానని ఒకసారి.. పిల్లలు లేరని ఓ మహిళ విలపించడంతో ఆమెకు ఇచ్చానని మరోసారి.. పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంజలి... తనకేమీ తెలియదని, తన భర్త ఇవ్వమంటే బిడ్డను ఇచ్చానని చెప్పింది. దంపతులు విచారణకు సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు.  

>
మరిన్ని వార్తలు