ఇంజనీరింగ్‌ సీట్లపై అదే ఉత్కంఠ!

14 Jun, 2017 02:29 IST|Sakshi
ఇంజనీరింగ్‌ సీట్లపై అదే ఉత్కంఠ!
- కాలేజీలు, సీట్ల జాబితాపై జేఎన్‌టీయూహెచ్‌ జాప్యం
- 14 లేదా 15న జాబితా.. 75 వేల సీట్లకు అనుమతి? 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏయే ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తారన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. గడిచిన ఐదారేళ్లుగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలు, సీట్ల వివరాలపై జేఎన్‌టీయూహెచ్‌ చివరి క్షణం వరకూ జాప్యం చేస్తూ వస్తోంది. ఈసారి అదే పరిస్థితి. రాష్ట్రంలోని 250 కాలేజీలు, వాటిల్లోని 1,26,315 సీట్లకు నెల రోజుల కిందటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపునిచ్చింది.

అయితే కాలేజీల్లో సదుపాయాలు పరిశీలించి అనుబంధ గుర్తింపు ఇవాల్సిన యూనివర్సిటీలు మాత్రం ఆలస్యం చేస్తున్నాయి. ఎట్టకేలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కాలేజీలు, వాటిల్లోని దాదాపు 10 వేల సీట్ల జాబితాలను మంగళవారం ఉన్నత విద్యా మండలికి అందజేశాయి. కానీ 95 శాతం కాలేజీలు, సీట్లున్న జేఎన్‌టీయూ మాత్రం మంగళవారం రాత్రి వరకూ జాబితాలివ్వలేదు. అయినా ఉన్నత విద్యా మండలి 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభించింది. 16 నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు షెడ్యూలు జారీ చేసింది. 
 
కౌన్సెలింగ్‌ ఆగిపోతుందని..
ఈ నెల 10 నాటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలిస్తామన్న జేఎన్‌టీయూ ఇంతవరకూ ఇవ్వలేదు. కాలేజీలు, సీట్ల వివరాల జాబితాలను ముందుగానే ఇస్తే యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగిపోయే పరిస్థితి ఉంటుందని చివరి క్షణం వరకు జాబితా ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈనెల 14 లేదా 15వ తేదీ రాత్రికి జాబితాలిచ్చే అవకాశం ఉందని, 75 వేల ఇంజనీరింగ్‌ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్ని కాలేజీలు, సీట్లకు జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు ఇస్తుందోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఏఐసీటీఈ 1.39 లక్షల సీట్లకు అనుమతిచ్చినా.. 1.04 లక్షల సీట్లలో ప్రవేశాలకే వర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. 
 
నేడు 16,001– 26 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్‌
ఎంసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో భాగంగా ఈ నెల 14న 16,001 ర్యాంకు నుంచి 26 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. నిర్ణీత హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. స్పెషల్‌ కేటగిరీలో స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ వారికి ఒకటి నుంచి 36 వేల ర్యాంకు వరకు, క్యాప్‌లో ఒకటి నుంచి 40 వేల ర్యాంకు వరకు సాంకేతిక విద్యాభవన్‌లో బుధవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. సోమ, మంగళవారాల్లో ఒకటి నుంచి 16 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్‌కు పిలువగా.. 10,279 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారని క్యాంపు అధికారి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 9,172, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 710, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 342, నాన్‌ లోకల్స్‌ 55 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. గతేడాది ఒకటో ర్యాంకు నుంచి 16 వేల ర్యాంకు వరకు 9,566 మంది వెరిఫికేషన్‌ చేయించుకున్నట్లు చెప్పారు.
మరిన్ని వార్తలు