తెలంగాణకు రెండో విడత కరువు సాయం

2 Apr, 2016 02:54 IST|Sakshi

రూ. 328 కోట్లు విడుదల చేసిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్: కరువు సాయంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో రూ.328 కోట్లు విడుదల చేసింది. ముందుగా కేంద్రం ప్రకటించిన సాయంలో రెండో విడతగా ఈ నిధులను కేటాయించింది. రాష్ట్రంలో 231 మండలాలను ప్రభుత్వం డిసెంబరులోనే కరువు మండలాలుగా ప్రకటించింది. వర్షాభావంతో నెలకొన్న దుర్భర పరిస్థితులు, కరువును అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలకు తక్షణ సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి కరువు పరిస్థితులను పరిశీలించారు.

ఈ బృందం చేసిన సిఫారసుల మేరకు జనవరిలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.791 కోట్ల కరువు సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కావటంతో జనవరిలో ఈ నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రకృతి విపత్తుల సహాయ నిధిలో అందుబాటులో ఉన్న రూ.78.56 కోట్లు వాడుకోవాలని సూచించింది. మిగతా నిధులను త్వరలోనే విడుదల చేస్తామని లేఖ రాసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో మొదటి విడతగా రూ.56.30 కోట్లు విడుదల చేసింది.

రెండో విడతగా ఇప్పుడు రూ.328 కోట్లు కేటాయించింది. మిగతా నిధులను చివరి విడతగా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మరో రూ.328 కోట్ల సాయం కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వచ్చింది. వచ్చే పంటకు పెట్టుబడి రాయితీగా అందించే ఈ మొత్తానికి దాదాపు రూ.900 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.

ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు ఆలస్యమవటంతో కరువు మండలాల్లోని రైతులు తమకెప్పుడు సాయం అందుతుందా? అని నిరీక్షిస్తున్నారు. మే నెలలోగా ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు చెల్లిస్తామని ఇటీవలే వ్యవసాయశాఖ మంత్రి పోచారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అరకొరగా విడతల వారీగా నిధులు విడుదల చేయటం.. చెల్లింపులపై ప్రభావం చూపనుంది.

మరిన్ని వార్తలు