ప్రైవేట్ విద్యా సంస్థలతో రహస్య ఒప్పందం

20 Apr, 2016 00:51 IST|Sakshi
ప్రైవేట్ విద్యా సంస్థలతో రహస్య ఒప్పందం

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల మండిపాటు
 
 సాక్షి, హైదరాబాద్: గత పాలకులు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను ప్రక్షాళ న చేయాల్సిన అవసరం లేదా అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రభుత్వ తనిఖీలను వ్యతిరేకిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుందని, అందుకే వారికి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు భానుప్రసాద్ , వెంకటరావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే అక్షరాస్యతలో తెలంగాణ అట్టడుగు స్థాయికి చేరిందని విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అంతులేకుండా పోయిందన్నారు.

ట్యూషన్, మెస్ ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కాజేసేందుకే కొన్ని కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలిశాయని పేర్కొన్నారు. బోగస్ కాలే జీలకు కళ్లెం వేసేందుకే ప్రభుత్వం తనిఖీలకు ఆదేశించిందని, ఈ చర్యలను అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన రహస్య ఎజెండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు తనిఖీలు జరిపితే యాజమాన్యాలకు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు