హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత

1 Apr, 2016 03:48 IST|Sakshi
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత

♦ కేరళ ఎంపీలకు వర్సిటీలోకి అనుమతి నిరాకరణ
♦ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన ఎంపీలు, విద్యార్థులు
 
 హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో గురువారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేరళకు చెందిన వామపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు పీకే బిజు, ఎంబీ రాజేష్, డాక్టర్ ఎ.సంపత్ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్ర మే తాము వచ్చామని వారు సెక్యూరిటీ సిబ్బం దికి స్పష్టం చేశారు. అయినా వారిని లోనికి అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

కేరళ ఎంపీలను అడ్డుకున్నారనే విషయం తెలుసుకున్న హెచ్‌సీయూ విద్యార్థులు ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంపీలను లోపలికి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పార్లమెంట్ సభ్యులను లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో ఎంపీలు, విద్యార్థులు ప్రధాన గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు.

 స్మృతి పదవిని దిగజార్చారు: కేరళ ఎంపీ
 కేంద్ర విద్యా శాఖకు మౌలానా ఆజాద్ వన్నె తెస్తే.. స్మృతి ఇరానీ ఆ పదవిని దిగజార్చారని కేరళ ఎంపీ ఎంబీ రాజేష్ విమర్శించారు. హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం దేశంలోని వర్సిటీలను కాషాయీకరణ చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌లోనూ స్మృతి ఇరానీ అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ఆగడాలు పెరిగిపోయాయన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆంగ్లేయుల కాలంలో భారతీయులపై పెట్టిన ఐపీసీ 124(ఏ) సెక్షన్ల కింద విద్యార్థులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును ‘అప్పర్’ రావు కాదని.. ‘లోయర్’రావుగా పీకే బిజు అభివర్ణించారు. హెచ్‌సీయూలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, వీసీ, రిజిస్ట్రార్‌లను కలసి మాట్లాడాలని అనుకున్నప్పటికీ వారు స్పందించకపోవడం, లోపలికి అనుమతించకపోవడం విడ్డూరమన్నారు. మరో ఎంపీ సంపత్ మాట్లాడుతూ హెచ్‌సీయూలో సాక్షాత్తు పార్లమెంటు సభ్యులతో అనుసరించిన వైఖరి చూస్తూంటే ఇక విద్యార్థులతో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందన్నారు. హెచ్‌సీయూలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.
 
  కుల నిర్మూలన పోరాటానికి కేంద్రం: తీస్తా సెతల్వాద్
 హెచ్‌సీయూ కుల నిర్మూలన పోరాటానికి కేంద్రంగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ విమర్శించారు. గురువారం విద్యార్థులకు సంఘీభావం తెలిపేం దుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య, ఆ తర్వాత జరిగిన ఘటనలను సమాజంలోని అన్ని వర్గాల వారు ఖండించాలన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, కేంద్రం దిగి వచ్చే వరకు విద్యార్థుల పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు