వికలాంగుల కోసం సరికొత్త పథకం

30 Jul, 2017 04:20 IST|Sakshi

స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనలో భారీ మొత్తంలో రాయితీలు
బ్యాంకు రుణంలో గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ..
.   
సాక్షి, హైదరాబాద్‌: వికలాంగులకు శుభవార్త. నిరుద్యోగ వికలాంగులు స్వయం ఉపాధివైపు అడుగేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ మేరకు వికలాంగుల పునరావాస పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన వికలాంగులు స్వయం ఉపాధి యూనిట్‌ను స్థాపిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు రాయితీ ఇవ్వనుంది. 2017–18 వార్షిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద అర్హులకు వయోపరిమితి విధించింది. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న వికలాంగులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంకు రుణంతో లింకు
తాజాగా వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాన్ని బ్యాంకుతో అనుసంధానం చేసింది. యూనిట్‌ను స్థాపించే ముందు బ్యాంకు ద్వారా రుణాన్ని పొందాలి. అలా పొందిన రుణంలో నిబంధనల మేరకు రాయితీని బ్యాంకుకు విడుదల చేస్తారు. రాయితీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియ జిల్లా సంక్షేమాధికారుల సమక్షంలో జరుగుతుంది. త్వరలో ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది.

నెలకొల్పే యూనిట్‌ విలువ, రాయితీ వివరాలు ఇలా...
    యూనిట్‌ విలువ                     రాయితీ
    రూ.1 లక్ష                             80 వేలు
    రూ.2 లక్షలు                      1.4 లక్షలు
    రూ.5 లక్షలు                         3 లక్షలు
    రూ.10 లక్షలు                      5 లక్షలు

మరిన్ని వార్తలు