తొలిసారి ప్రపంచాన్ని చూశా..

25 Jan, 2016 01:05 IST|Sakshi
తొలిసారి ప్రపంచాన్ని చూశా..

అనుబంధం
 

అల్లిబిల్లి పదాలతో అద్భుత అర్థాలను సృష్టించిన పాటల రచయిత అతడు. ఆయన కలమే ఓ విప్లవ గళమై నినదిస్తుంది.. అమ్మలా లాలిస్తుంది. ఆయనకు ఇన్ని భావాలను, అనుభవాలను నేర్పించింది మాత్రం ఈ మహానగరమేని చెబుతాడిప్పుడు. ఆయన చంద్రబోస్. ప్రముఖ సినీగీత రచయిత. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామం చల్లగరిగ నుంచి వచ్చిన కుర్రాడు ఇప్పుడు భాగ్యనగరంతో పెనవేసుకుపోయాడు. నగరంపై ఆయన మమకారపు అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
 
‘1986లో హైదరాబాద్ వచ్చాను. అమ్మ, నాన్నల రక్షణ నుంచి అప్పుడే బయటకు రావటం. స్వతంత్రంగా హైదరాబాద్‌లో తిరగటం ప్రారంభమైంది. అప్పుడే తొలిసారి ప్రపంచాన్ని చూశాను. ఆకలి అనుభవం, ఒంటరితనం, అవమానం, దైన్యం, నైరాశ్యం ఇలాంటివన్నీ ఈ నగరంలో అనుభవించాను. కొంత కాలం తర్వాత సంపాదన, కీర్తి, విజయం, మానవత పొందాను. విభిన్న పార్శ్వాలు, ధ్రువాలు గల విశ్వనగరానికి సరైన నిర్వచనం హైదరాబాద్. ఇరానీ కేఫ్‌లో రూ. 2 సమోసాలతో పాటు పార్క్ హయత్‌లో రూ.3 వేల లంచ్ వరకు ఇక్కడ రుచి చూడవచ్చు. ఎంతో వైవిధ్యం ఉన్న నగరమిది. ఇక్కడ వాతావరణం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

నివాస యోగ్యమైన వాతావరణం. ఎలాంటి భయం లేని ప్రాంతం. ఇక్కడి భౌగోళిక వాతావరణం, ఉష్ణోగ్రత ఆరోగ్యకరంగా ఉంటాయి. హైదరాబాద్ అంటే ఒక్క ఊరు కాదు ఎన్నో ఊళ్ల (గ్రామాల) సమ్మేళనం. ఇక్కడ ఒక వైపు ఏపీ వారు, మరొక వైపు రాయలసీమవాసులు, తమిళులు, గుజరాత్, జైనులు, సిక్కులు, నేపాలీలు, కన్నడిగులు ఒక రేమిటి.. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషలు, సంస్కృతుల వారు ఇక్కడ ఉన్నారు. అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో కలిసి కట్టుగా ఉండేందుకు స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. మంగా టిఫిన్ సెంటర్, గణపతి కాంప్లెక్స్‌ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉన్నారు. మరోపక్క భారతదేశానికే ఆరోగ్య రాజధాని ఈ నగరం. సాఫ్ట్‌వేర్ రంగంలో మన స్థానం మనదే. ఇప్పుడు నగరం అభివృద్ధి మెట్రో కన్నా వేగంగా పరుగెడుతోంది. అన్ని వర్గాలు, మతాలు, అన్నీ పార్టీల ప్రజానీకాన్ని ఏకం చేసేది ఒక్కటే ఒక్కటి. అదే హైదరాబాద్ దమ్ బిర్యానీ’ అంటూ ముగించారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా