ఇంత దారుణమా?

12 Aug, 2015 23:55 IST|Sakshi
ఇంత దారుణమా?

విస్తుపోయిన అధికారులు
 
దూలపల్లి పారిశ్రామిక వాడలో అక్రమ రసాయన గోదాములను... ప్రమాదకర పరిస్థితులను చూసి అధికారులు విస్తుపోయారు. కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు నివేదిక పంపించాలని నిర్ణయించారు.
 
కుత్బుల్లాపూర్:అధికార యంత్రాంగం కదిలింది. దూలపల్లి పారిశ్రామికవాడలో అనుమతి లేని గోదాముల విషయంపై ఆరా తీసింది. గోదాముల లోపలికి వెళ్లిన అధికారులు ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘మీరు ఇక్కడెలా పని చేస్తున్నార’ని కార్మికులను ప్రశ్నించారు. పూట గడవాలంటే ఇలాంటి పాట్లు తప్పవంటూ వారు జవాబు ఇచ్చారు. రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో కలియ తిరిగిన అధికారులు భూమిలో ఇంకుతున్న రసాయనాలను చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... ‘ఇక్కడ ఇదంతా కామనే మేడమ్’ అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. అధికారులను చూసి ఒక్కొక్కరుగా గోదాములకు తాళాలు వేసి పరుగులు పెట్టారు. మరి కొందరు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని ఐడీఏ దూలపల్లిలో రసాయన మాఫియా ఆగడాలపై ‘సాక్షి’ లో వస్తున్న వరుస కథనాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎంపీపీ సన్న కవిత, సర్పంచ్ చింతల లక్ష్మి, ఎంపీడీవో కె.అరుణ, ఈవోపీఆర్డీ మల్లారెడ్డి, ఈవో విజయ్‌కుమార్, బిల్ కలెక్టర్ కరుణాకర్‌రెడ్డి లు బుధవారం సర్వే నెంబరు 135లో పర్యటించారు. సర్వే నెంబరు 127, 158, 182లలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ గోదాములను గుర్తించారు. గతంలో 105 నోటీసులు జారీ చేయగా, కేవలం 15 మందే బదులిచ్చారని, మిగిలిన 90 మంది నిర్వాహకుల పరిిస్థితిపై నివేదిక అందజేయాలని ఈవోను ఎంపీడీవో అరుణ ఆదేశించారు.  

 అక్కడే ఇంకిపోయేలా...
 గోదాముల నిర్వాహకులు వ్యర్ధ రసాయనాలను భూమి లో ఇంకే విధంగా పెద్ద గుంతలను తవ్వుతున్నారు. అధికారులు పరిశీలించిన 15 గోదాముల్లో ఇదే తరహాలో ఇంకుడు గుంతలు గుర్తించారు.  అక్రమ గోదాములు వెలిసే సమయంలోనే కట్టడి చేయలేని పంచాయతీ సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 కలెక్టర్‌కు నివేదిక
 ‘సాక్షి’ లో వస్తున్న వరుస కథనాలు చూసి ఇక్కడికి వచ్చాం. పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రతి గోదాములో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి రసాయనాలను డంప్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క గోదాముకూ అనుమతి లేదు. గతంలోనే నోటీసులు జారీ చేశాం. వారిలో కొంతమందే స్పందించారు. మిగిలిన వాటిని సైతం గుర్తిస్తాం. పూర్తి స్థాయి నివేదికను  కలెక్టర్‌కు అందజేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
 - కె.అరుణ, ఎంపీడీవో, కుత్బుల్లాపూర్
 
 

మరిన్ని వార్తలు