వర్క్‌లేదు... వర్క్‌ షాపులే..

10 Aug, 2017 03:48 IST|Sakshi
వర్క్‌లేదు... వర్క్‌ షాపులే..
రైతును ఆదుకోని ‘పరిశోధన’
 
నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వరి ఎకరానికి 60 బస్తాలు పండితే అదే జిల్లాలో కొన్నిచోట్ల 40 బస్తాలే పండుతోంది. 
ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు పండుతుంటే వరంగల్‌ జిల్లాలో 8 క్వింటాళ్ల వరకు, మరికొన్ని చోట్ల ఆరు క్వింటాళ్లకే పరిమితమవుతోంది.
కంది ఎకరాకు తాండూరులో 8–10 క్వింటాళ్లు పండితే, కొన్ని ప్రాంతాల్లో కేవలం ఐదారు క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంట దిగుబడుల్లో భారీ తేడా కనిపిస్తోంది. పక్క పక్క మండలాల్లో ఒకే రకమైన నేలల్లో ఒకే తరహా సాగు పద్ధతులు అవలంబిస్తున్నా దిగుబడులు మాత్రం ఒకేలా రావడంలేదు. భూములు, భూసారంలో తేడాలు, సాగు పద్ధతులు, నీటి లభ్యత, ఎరువుల వాడకంలో లోపాలు వంటి కారణాలు ఇందుకు కారణమైనప్పటికీ ఈ విషయంలో రైతులకు దిశానిర్దేశం చేయడంలో రాష్ట్రంలోని జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు విఫలమవుతున్నాయి.  కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. కోట్లాది నిధులిస్తున్నా క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దకుండా అవి కేవలం వర్క్‌షాప్‌లకే పరిమితమవుతున్నాయి.  దీనిపై గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాయాలని యోచిస్తోంది.
 
పేరు గొప్ప చందం...
దేశంలో ఎక్కడా లేనట్లుగా వివిధ జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు తెలంగాణలో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి సంస్థ ఇక్రిశాట్‌ సంగారెడ్డి జిల్లాలో ఉండగా భారత నూనె గింజల సంస్థ, సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌ (క్రిడా), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) సహా అనేక జాతీయ శిక్షణ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయినా రాష్ట్రంలో ఏటా వందలాది మంది అన్నదాతలు.. పంటలు ఎండిపోవడం, అప్పుల భారం తీర్చలేకపోవడం వంటి కారణాల వల్ల బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
 
లక్ష్యం ఘనమైనదే కానీ...
కొత్త వంగడాల సృష్టి, పంట దిగుబడుల పెంపు, ఆహార భద్రత సాధన, తెగుళ్ల నివారణ తదితర లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పరిశోధన సంస్థలు ఈ విషయంలో రాష్ట్రానికి చేస్తున్న మేలు నామమాత్రంగానే ఉంటోంది. జన్యుపరిశోధనల ద్వారా పంట దిగుబడి, వరి నాణ్యతను పెంపు, వ్యాధి నిరోధక వంగడాలను అభివృద్ధిలో పరిశోధనలు సాగించే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చి రాష్ట్ర రైతాంగానికి చేసిన సాయం ఏమిటంటే మాత్రం సమాధానం కరువవుతోంది. పొద్దు తిరుగుడు, కుసుమ, ఆముదం పంటల్లో నూనె శాతాన్ని పెంచడంపై ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించే డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆయిల్‌సీడ్స్‌ రీసెర్చ్‌ రాష్ట్రంలో నూనె గింజల సాగు, ఉత్పత్తిలో పోషిస్తున్న పాత్ర ఏమిటో ఎవరికీ అంతుబట్టడంలేదు.

అన్ని ప్రాంతాల రైతులకు లాభం కలిగించేలా జొన్నను అభివృద్ధి పరచాల్సిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ సోరగాం రీసెర్చ్‌...రాష్ట్రంలో జొన్న పంటను వృద్ధి చేయడంలో సఫలం కాలేదు. కీటకశాస్త్రం, మొక్కల వ్యాధి విజ్ఞానశాస్త్రం, ప్లాంట్‌ ఇంజనీరింగ్, రొడెంట్, కలుపు మొక్కల నివారణ వంటి విభాగాల్లో నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వíహించే నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌...రాష్ట్ర రైతాంగానికి అందిస్తున్న సేవలు అంతంతే. మొక్కజొన్నలో రాష్ట్రవ్యాప్తంగా దిగుబడులు ఒకేరకంగా ఉండేలా చర్యలు తీసుకోవడంలో మొక్కజొన్న పరిశోధన కేంద్రం సఫలం కాలేదన్న విమర్శలున్నాయి.
 
దిగుబడుల్లో తేడా తగ్గించండి...
రాష్ట్రంలోని వివిధ జాతీయ పరిశోధన సంస్థల ప్రతినిధులతో ఇటీవల సమావేశమైన వ్యవసాయశాఖ... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, సోయాబీన్‌ పంట దిగుబడుల్లో తేడాను ఐదు శాతానికి తగ్గించేలా పరిశోధనలు చేయాలని సూచించింది. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై రైతుల్లో అవగాహన కల్పించాలని కోరింది. వ్యవసాయ యాంత్రీకరణలో జరుగుతున్న లోపాలను గుర్తించాలని స్పష్టం చేసింది.  
మరిన్ని వార్తలు