ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాల్లేవు

13 Sep, 2017 03:56 IST|Sakshi
జీఎస్‌ఐ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌
 
హైదరాబాద్‌: ఉద్దానం నీటిలో ఎలాంటి ప్రమాదకర మూలకాల్లేవని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇటీవల తాము జరిపిన పరిశోధనల్లో ఈ అంశం స్పష్టమైనట్లు పేర్కొన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల బారిన పడి వేలాది మంది మృతి చెందడానికి కారణం అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) పరీక్షల్లో తేలిందనడం అవాస్తవమని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య ఆగస్టులో ఉద్దానం నుంచి సేకరించిన 12 నీటి నమూనాలను పరీక్ష కోసం అందజేసినట్లు తెలిపారు.

వాటితో పాటు మరో 8 నమూనాలను తమ సిబ్బంది సేకరించారని, వాటితో కలిపి మొత్తం 20 నమూనాలను పరీక్షించగా ఎలాంటి హానికరమైన మూలకాలు అందులో లేవని తేలిందని వివరించారు. ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాలు ఉన్నాయని జీఎస్‌ఐ నిర్ధారించినట్లు నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డా.రాజారెడ్డి చెప్పారని పేర్కొనడం సరైంది కాదన్నారు. ఆయనను ఫోన్‌లో సంప్రదించగా ఉద్దానం నీటిలో ప్రమాదకరమైన మూలకాలు ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదని చెప్పినట్లు వివరించారు. కాడ్మియం, క్రోమియం, సిలికా, లెడ్‌ మూలకాలు అధికంగా ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే రాజారెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు.

ఉద్దానం పరిసర ప్రాంతాలపై అధ్యయనానికి జీఎస్‌ఐ 2018–19 సంవత్సరంలో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో ఆర్‌ఎంహెచ్‌–3 డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రేమ్‌చంద్, డైరెక్టర్‌ కె.రవి, కెమికల్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ శోభారాణి, అజయ్‌కుమార్, కామేశ్వర్‌ పాల్గొన్నారు. ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల్లో విశేషంగా కృషి చేసిన డాక్టర్‌ రాజారెడ్డి చెప్పిన అంశాల మేరకే సమావేశంలో చెప్పామని, జీఎస్‌ఐ అధికారుల ప్రకటనపై ఆయనే స్పందించాల్సి ఉందని, శాస్త్రీయ అంశాల్లో తమకు ప్రవేశం లేదని కె.రామచంద్రమూర్తి తెలిపారు. 
>
మరిన్ని వార్తలు