ఐదు వస్తువులపై జీఎస్టీ లేదు

19 Sep, 2017 03:10 IST|Sakshi
ఐదు వస్తువులపై జీఎస్టీ లేదు
ఖాదీ వస్త్రాలు, చేనేత చరఖాలు, మట్టివిగ్రహాలు, పత్తిచెక్క, చీపుర్లకు పన్ను మినహాయింపు
 
సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో భాగంగా మరికొన్ని వస్తువుల రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశంలో నిర్ణయించిన మేరకు మొత్తం 40 వస్తువుల పన్ను శ్లాబులను మారుస్తూ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఖాదీ వస్త్రాలు, చేనేత చరఖాలు, మట్టి విగ్రహాలు, పత్తి చెక్క, చీపుర్లను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించింది. ప్రస్తుతం ఖాదీ వస్త్రాలు,  చీపుర్లు, పత్తిచెక్కపై ఐదు శాతం జీఎస్టీ ఉండగా, మట్టి విగ్రహాలపై 28 శాతం, చేనేత చరఖాలపై 18 శాతం జీఎస్టీ ఉంది.

తాజా మినహాయింపు నేపథ్యంలో ఇక నుంచి ఈ వస్తువుల క్రయవిక్రయ లావాదేవీల్లో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే మరో 35 వస్తువులపై కూడా జీఎస్టీని తగ్గించింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది బిందు సేద్యం పరికరాలు. బిందు సేద్యానికి ఉపయోగించే నాజిల్స్, స్ప్రింక్లర్లను గతంలో 18 శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చగా ఇప్పుడు దాన్ని 12 శాతానికి తగ్గించారు. అదేవిధంగా కంప్యూటర్‌ మానిటర్లపై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి, కిచెన్, శానిటరీ సామగ్రిని 18 శాతం నుంచి 12 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. శ్లాబులు తగ్గించిన వస్తువుల్లో ఎండు చింతపండు, ఇడ్లీ, దోశ పిండి, స్టెరైల్‌ డిస్పోజబుల్‌ గ్లౌజులు, రెయిన్‌కోట్లు, శారీఫాల్స్, జౌళి టోపీలు, చెక్క, రాతి, మెటల్‌ విగ్రహాలు, దూది బొంతలు ఉన్నాయి.

పూజా సామగ్రిపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించారు. అగరబత్తీలు, ధూప సామగ్రి, సాంబ్రాణీలను 12 శాతం నుంచి 5 శాతం పన్ను శ్లాబులో చేర్చగా ప్రార్థనలకు ఉపయోగించే పూసలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. 9న జరిగిన భేటీలో మొత్తం 134 వస్తువుల పన్ను శ్లాబులను మార్చాలని ఎజెండాలో చేర్చినా కేవలం 40 వస్తువులపైనే చర్చ జరగడంతో మిగిలిన 94 వస్తువులపై అక్టోబర్‌ 24న జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
మరిన్ని వార్తలు