-

వందకు మించలేదు!

19 Sep, 2015 04:37 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నూతన విధానం ప్రకారం మహా నగరంలో 503 దుకాణాలకు ఈ నెల 14 నుంచి ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐదు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలకు అందిన దరఖాస్తుల సంఖ్య వందకు మించకపోవడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లో 72 దుకాణాలు ఉండగా... శుక్రవారం వరకు గోల్కొండ, అమీర్‌పేట్ ప్రాంతాల్లోని రెండు దుకాణాలకు ఒక్కొక్కటే దాఖలైనట్లు తెలిసింది.

గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుకు రెండేళ్ల కాల పరిమితికి రూ.2.16 కోట్ల లెసైన్సు ఫీజు నిర్ణయించిన విషయం విదితమే. ఈ ఫీజు గతానికంటే 20 శాతం పెరగడంతో పాటు దరఖాస్తు రుసుమును రూ.50 వేలుగా నిర్ణయించారు. వీటితో పాటు నిర్ణీత పరిమితికి మించి అమ్మకాలు సాగితే ప్రివిలేజు ఫీజు భారీగా చెల్లించాల్సివస్తోంది. దీంతో గతంలో మాదిరిగా పోటీ అంతగా లేనట్లు తెలిసింది. దీంతో పూర్తి స్థాయిలో దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్న వారే దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలిసింది. తుది గడువు ఈనెల 21తో ముగియనుండడంతో చివరి రెండు రోజులు దరఖాస్తులు వెల్లువెత్తుతాయని అధికారుల అంచనా. ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోతే.. మిగిలిపోయిన మద్యం దుకాణాలను బ్రీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిసింది.

 ఈనెల 23న డ్రా..
 హైదరాబాద్ జిల్లా పరిధిలోని దుకాణాలకు ఈ నెల 23న 11 గంటలకు అంబర్‌పేట్‌లోని రాణా ప్రతాప్ పంక్షన్ హాలులో డ్రా నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని దుకాణాలకు అదే రోజున ఉదయం 11 గంటలకు నాగోలులోని అనంతుల రాంరెడ్డి గార్డెన్స్‌లో డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రాజశేఖర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు