టాప్‌–10లో ఒక్కటీ రాలేదు

12 Jun, 2017 01:34 IST|Sakshi
తల్లిదండ్రులతో విజయానందాన్ని పంచుకుంటున్న ఫస్ట్‌ ర్యాంకర్‌ సర్వేశ్‌
- జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరవని తెలుగు రాష్ట్రాలు
టాప్‌–100లో 23 ర్యాంకులతో సరి
టాపర్‌గా చండీగఢ్‌కు చెందిన సర్వేశ్‌
 
సాక్షి, హైదరాబాద్‌/చెన్నై: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు రాష్ట్రాలకు టాప్‌ ర్యాంకులు కరువయ్యాయి. టాప్‌–10లో ఒక్క ర్యాంకు లభించ లేదు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్‌–10లో కనీసం నాలుగైదు ర్యాంకులు సాధించామని చెప్పుకునే ప్రముఖ విద్యా సంస్థలు కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరవలేదు. ఆదివారం మద్రాస్‌ ఐఐటీ వెల్లడించిన ఈ ఫలితాల్లో చండీగఢ్‌కు చెందిన సర్వేశ్‌ మెహతానీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తం 366 మార్కులకుగానూ సర్వేశ్‌ 339 మార్కులతో సత్తా చాటాడు. పుణేకు చెందిన అక్షత చుఘ్‌(335 మార్కులు) రెండో ర్యాంకు, ఢిల్లీకి చెందిన అనన్య అగర్వాల్‌(331 మార్కులు) మూడో ర్యాంకు దక్కించుకున్నారు.

ఐఐటీ–జేఈఈ మెయిన్‌ పరీక్షలో 2.2లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. వారిలో 1,59,540 మంది మే 21న జరిగిన పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించా రు. టాప్‌–10లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా.. టాప్‌–100లో 23 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించా రని, మొత్తంగా తెలంగాణ, ఏపీ నుంచి 28 వేల మంది వరకు పరీక్ష రాయగా 5 వేల మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు విద్యాసం స్థలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తం గా 23 ఐఐటీల్లో ఉన్న సుమారు 11 వేల సీట్లు న్నాయి. ఈ ఏడాది ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో 11 బోనస్‌ మార్కులు కలిపారు. 
 
తెలుగు విద్యార్థికి 17వ ర్యాంకు 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని గార్లపేటకు చెందిన వడ్డెల ఆశ్రుత్‌ 17వ ర్యాంకుతో తెలంగాణ, ఏపీ నుంచి ప్రథమ స్థానంలో నిలిచాడు. జేఈఈ మెయిన్‌లో ఆరో ర్యాంకు సాధించిన మోహన్‌ అభ్యాస్‌కు అడ్వాన్స్‌డ్‌లో 64వ ర్యాంకు లభించింది. ఖమ్మంకు చెందిన బి.రాహుల్‌ ఎస్టీ విభాగంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో టాప్‌–10 ర్యాంకులను సాధించిన విద్యార్థు లు, జేఈఈ మెయిన్‌లోనూ టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రం టాప్‌–10లో నిలువలేకపోయారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) రాసేందుకు రిజిస్ట్రేషన్‌కు ఐఐటీ మద్రాస్‌ అవకాశం కల్పించింది. ఏఏటీని ఈ నెల 14న నిర్వహించి 18న ఫలితాలు విడుదల చేయనున్నారు.
 
సత్తా చాటిన మద్రాస్‌ జోన్‌
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐటీ మద్రాస్‌ జోన్‌ సత్తా చాటింది. ఈ జోన్‌ నుంచి 10,240 మంది అర్హత సాధిస్తే.. ఐఐటీ బాంబే జోన్‌ నుంచి 9,893 మంది, ఐఐటీ ఢిల్లీ జోన్‌ నుంచి 9,207 మంది అర్హత సాధించారు. మూడేళ్లుగా ఐఐటీ బాంబే జోన్‌ నుంచే ఎక్కువ మంది విద్యార్థులు ర్యాంకులు సాధిస్తుండగా.. ఈసారి ఐఐటీ మద్రాస్‌ జోన్‌ దానిని వెనక్కి నెట్టింది. 
 
కఠోర శ్రమే విజయ రహస్యం: సర్వేశ్‌
కఠోర శ్రమ.. లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరించి చదవడమే తన విజయ రహస్యమని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఫస్ట్‌ ర్యాంకు సాధించిన సర్వేశ్‌ మెహతానీ పేర్కొన్నాడు. టీవీలో కార్టూన్లు చూడటం.. సంగీతం వినడం.. బ్యాడ్మింటన్‌ ఆడటం.. ఇవే తనను ఒత్తిడికి దూరంగా ఉంచేవని చెప్పాడు. రెండేళ్లుగా తాను సెల్‌ఫోన్, సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నానని, తాను 8వ తరగతిలో ఉండగా వచ్చిన 3 ఇడియట్స్‌ సినిమా తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పాడు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి తన రోల్‌ మోడల్‌ అని చెప్పారు. సర్వేశ్‌ జేఈఈ మెయిన్‌లో 55వ ర్యాంకు సాధించడం గమనార్హం.
 
ఏడు దశల్లో కౌన్సెలింగ్‌
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడి కావడంతో ప్రవేశాలు చేపట్టేందుకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఏర్పాట్లు చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుతోపాటు ఇంటర్‌లో 75 శాతం మార్కులు సాధించిన వారు ఐఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులుగా ప్రకటించింది. గతేడాది 6 దశల కౌన్సెలింగ్‌ నిర్వహించగా ఈసారి ఏడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. 31 ఎన్‌ఐటీలు, 23 ఐఐటీలు, 23 ట్రిపుల్‌ఐటీలు, 20 జీఎఫ్‌టీఐలలో దాదాపు 38 వేల సీట్లను భర్తీ చేయనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్‌ను ప్రారంభిం చేందుకు షెడ్యూలు జారీ చేసింది. కాలేజీల వారీగా సీట్ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంచింది.
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు