ఏఎన్-32 అక్కడుందా..?

10 Sep, 2016 03:32 IST|Sakshi
ఏఎన్-32 అక్కడుందా..?

- 22 అనుమానిత ప్రాంతాల గుర్తింపు
- ఎన్‌ఐఓటీ, జీఎస్‌ఐల నేతృత్వంలో త్వరలో గాలింపు
- సముద్రంలో లక్ష చదరపు కిలోమీటర్ల మ్యాపింగ్ పూర్తి

సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ (ఏఎన్-32) విమాన శకలాలను గుర్తించేందుకు మరో ప్రయత్నం మొదలుకానుంది. రిమోట్ కంట్రోలర్ల సాయంతో పనిచేసే యంత్రాలను ఉపయోగించి కొన్ని అనుమానిత ప్రాంతాల్లో విమాన శకలాలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమానిత ప్రాంతాల గుర్తింపు, రిమోట్ యంత్రాల గుర్తింపునకు రెండు నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. దాదాపు రెండు మూడు రోజుల్లో గాలింపు చర్యలు ప్రారంభమవుతాయి. గత జూలై 22న దాదాపు 29 మందితో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు బయల్దేరిన వాయుసేన విమానం సుమారు 150 మైళ్ల దూరంలో గల్లంతైన విషయం తెలిసిందే.

విమాన శకలాలను గుర్తించేందుకు అప్పట్నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)లు తాజాగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేశాయి. వీటికి చెందిన సాగర్ రత్నాకర్, సాగర్ నిధి నౌకలు దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల సముద్రగర్భాన్ని సోనార్ టెక్నాలజీ ద్వారా మ్యాప్ సిద్ధం చేసింది. ఈ విస్తీర్ణంలో దాదాపు 70 ప్రాంతాల నుంచి కొంచెం అనూహ్యమైన సంకేతాలు అందుతున్నట్లు ఈ మ్యాప్‌ను అధ్యయనం చేసిన ఎన్‌ఐఓటీ గుర్తించింది. వేర్వేరు టెక్నాలజీలతో మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రాంతాల సంఖ్యను 22కు తగ్గించింది. రిమోట్ కంట్రోలర్ల సాయంతో పనిచేసే యంత్రాల ద్వారా ఈ ప్రాంతాల్లో శకలాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని ఎన్‌ఐఓటీ డెరైక్టర్ ఎస్‌ఎస్‌సీ షెణాయ్ ‘సాక్షి’కి తెలిపారు.

 రొబోటిక్ యంత్రాల వాడకం..
ఎన్‌ఐఓటీ నౌక సాగర్ నిధిలో ఉండే రిమోట్ కంట్రోలర్ యంత్రాలు పొడవాటి ఇనుప తీగల ద్వారా సముద్రపు లోతుల్లో పరిశీలిస్తుంది. దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల లోతుకు వెళ్లగల ఈ యంత్రాల్లో ఒక రొబోటిక్ చేయి, శక్తిమంతమైన కెమెరా ఉంటాయి. ఈ యంత్రాలు ఒకసారి దాదాపు పది మీటర్ల వైశాల్యంలోని ప్రాంతాన్ని పరిశీలించగలదని షెణాయ్ తెలిపారు. ప్రస్తుతం తాము అనుమానిత ప్రాంతాల సంఖ్యను మరింత నిశితంగా పరిశీలిస్తున్నామని, సముద్రగర్భంలోని సహజ నిర్మాణాల ద్వారా వచ్చే సంకేతాలను తొలగించి.. శకలాలు ఉన్న ప్రాంతాలను కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రిమోట్ యంత్రాలను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుందని, కాబట్టి ఈ కచ్చితత్వం అవసరమని వివరించారు. ఈ పరిస్థితుల్లో చెల్లాచెదురైన శకలాలను గుర్తించడం కూడా అంతే కష్టమవుతుందని పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా