వంట.. మంట

15 Aug, 2013 06:00 IST|Sakshi
వంట.. మంట

సాక్షి, సిటీబ్యూరో:ధరల సెగ దడ పుట్టిస్తోంది. కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. వంటింట్లో ప్రధాన వస్తువులైన పచ్చిమిర్చి, ఉల్లి ధరలైతే.. సామాన్యలకు అందనంత పైకి ఎగబాకాయి. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కిస్తుండగా, ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. వీటి ప్రభావం మిగతా కూరలపై చూపుతోంది.
 
 మార్కెట్లో ఏ రకం కొందామన్నా.. రూ.30-80 మధ్య ధర పలుకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు సీమాంధ్రలో ఆందోళనలు, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలో మిర్చి, ఉల్లి, ఇతర కూరగాయలకు కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరం పెరగడంతో ధరల దెయ్యం జడలు విప్పుకుంది. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కూరగాయలు కూడా నగర అవసరాలను ఏమాత్రం తీర్చలేక పోతున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధరల కత్తి దూస్తున్నారు. ఇష్టారీతిన పెంచేసి దగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. పాలకులకు పదవులు, పార్టీ వ్యవహారాలు తప్ప అదుపు తప్పిన నిత్యావసరాల ధరలు, ప్రజల బాధల గురిం చి పట్టించుకొనే తీరికే లేకుండా పోయింది. దీంతో సంబంధిత శాఖలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.
 
 ముందు చూపేదీ?
 సీమాంధ్రలో ఆందోళనల వల్ల అక్కడి నుంచి నగరానికి కూరగాయలు దిగుమతి ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటప్పుడు ముందస్తు చర్యలు చేపట్టి ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తెప్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖది. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రవాణా నిలిచిపోవడంతో మిర్చి కొరత ఎదురైందని సాకుగా చూపుతూ మార్కెటింగ్ శాఖ మౌనం వహిస్తోంది. నగర అవసరాలకు రోజుకు 100-150 టన్నుల మిర్చి కావాల్సి ఉండగా, ప్రస్తుతం 40-50 టన్నులకు మించి సరుకు రావట్లేదు.

అలాగే మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులు అనూహ్యంగా పెరగడం, దసరా నాటికి ధరలు మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో కొందరు రైతులు ఉల్లిని గోదాముల్లో నిల్వ చేస్తుండటంతో నగరానికి దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఉల్లికి మరింత డిమాండ్ ఏర్పడింది. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మహారాష్ట్రలోనే నేరుగా ఉల్లి కొనుగోలు చేసి నగరానికి తెప్పిస్తే ధరలు అదుపులో ఉండేవి.

కానీ పట్టించుకోలేదు. ఇక్కడి హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చిన సరుకులోనే కొంత (థర్డ్ గ్రేడ్) కొనుగోలు చేసి నామమాత్రంగా ఒక్కో రైతుబజార్‌కు 10 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేసి మమ అన్పించారు. రైతుబజార్‌లో కిలో రూ.25 చొప్పున ఒక్కొక్కరికి 2 కేజీలు అందించి 15 రోజుల పాటు సబ్సిడీపై ఇస్తున్న భ్రమలు కల్పించారు. ప్రస్తుతం సబ్సిడీ ఉల్లి విక్రయాలు సైతం నిలిచిపోయాయి.
 
 వాటిపైనా ప్రభావం..
 మిర్చి, ఉల్లి ధరలు పెరగడంతో ఈ ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. నిజానికి క్యారెట్, క్యాప్సికం, చిక్కుడు వంటివి తప్ప మిగతా కూరగాయలన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అయితే, వ్యాపారులు సమైక్య ఉద్యమాన్ని సాకుగా చూపి, ధరలు పెంచేశారు. ఉద్యమం ప్రారంభం కాకముందు, అంటే.. జూలై 29 నాటి ధరలతో ప్రస్తుత కూరగాయల ధరలు పోల్చి చూస్తే కిలోకు రూ.5-30 పెరుగుదల కన్పిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్ ధరలకు.. రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు. రెట్టింపు రేట్లతో వ్యాపారులు వినియోగదారుడి జేబును పిండుకొంటున్నారు. మార్కెటింగ్ శాఖ స్పందించక పోతే.. ఉల్లి, మిర్చి ధరలు కిలో రూ.100కు చేరే అవకాశం లేకపోలేదు.
 
 రేపటి నుంచి రూ.35కే ఉల్లి

 చాదర్‌ఘాట్: ఉల్లి ధర ఉరుముతుండడంతో మార్కెటింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం నుంచి రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.35కే విక్రయించనున్నట్లు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశ్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కల్పనాదేవి తెలిపారు. ఒక్కొక్కరికి కిలో మాత్రమే అందించనున్నట్లు పేర్కొన్నారు. ధర తగ్గే వరకూ ఈ విక్రయాలు కొనసాగుతాయన్నారు. వారు బుధవారం ఉల్లి వర్తకులతో సమావేశమై చర్చలు జరిపారు. రోజూ 60 క్వింటాళ్ల ఉల్లిని సరఫరా చేసేందుకు వారు అంగీకరించారని తెలిపారు.
 
 హాస్టళ్లు, మెస్ చార్జీలకూ రెక్కలు
 సనత్‌నగర్, న్యూస్‌లైన్: పెరిగిన కూరగాయల ధరల ప్రభావం బ్యాచిలర్స్‌పైనా పడింది. కూరల ధరలు కొండెక్కడంతో హాస్టళ్లు, మెస్‌లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు కూడా అమాంతం ధరలు పెంచారు. పెరిగిన ధరల పేరుతో.. వినియోగదారులకు భారీగానే ‘వడ్డిస్తున్నారు’. నిన్న మొన్నటి వరకూ రూ.2,800 ఉన్న హాస్టల్ అద్దె ఇప్పుడు రూ.3,200కు చేరింది. ఇక మెస్‌లలో భోజనం మరింత ప్రియంగా మారింది. చిన్నపాటి మెస్‌లో కూడా ప్లేట్ మీల్స్ రూ.80కి చేరింది. కర్రీ పాయింట్ సెంటర్లు కూడా ధరలను పెంచేశాయి. నిన్నటి వరకూ రూ.8-10లకు కర్రీ ఇస్తుండగా, ఇప్పుడు రూ.15 వరకూ పెంచేశారు. దీంతో యువత గగ్గోలు పెడుతోంది.
 
 రెండుసార్లు పెంచారు..

 మాది శ్రీకాకుళం జిల్లా. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్ ఉంటూ గ్రూప్-2 ప్రిపేర్ అవుతున్నా. ఏడాదిలోపే రెండుసార్లు అద్దె పెంచారు. అదేమంటే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయనే సాకు చెబుతున్నారు.    
 - సునీల్‌కుమార్, ఎస్‌ఆర్‌నగర్
 
 ఎలా బతికేది?
 మాది కర్నూలు. అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్‌లో ఉండి వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటున్నా. వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. హాస్టల్ అద్దెను రూ.2,800 నుంచి 3,000కు పెంచారు. అదేమంటే ధరలు పెరగడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. వారు చెప్పేది ఒక రకంగా బలమైన కారణమే అయినా.. నాలాంటి సామాన్యులు నగరంలో ఎలా బతికేది?    
 -కాశీం, అమీర్‌పేట్
 

మరిన్ని వార్తలు