రైల్వే ఉద్యోగాల పేరిట దగా

23 Jul, 2014 02:04 IST|Sakshi
రైల్వే ఉద్యోగాల పేరిట దగా

అత్తాపూర్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు దండుకొని మోసం చేస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని రాజేంద్రనగర్, ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.  మంగళవారం ఏసీపీ ముత్యంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వేలో పని చేస్తూ డిస్మిస్ అయిన అత్తాపూర్ హుడా కాలనీ నివాసి ఎ.ప్రశాంత్(39), ప్రైవేట్ ఉద్యోగి కందుల గోపాల్(29), ఖమ్మం జిల్లాకు చెందిన తేజ(30) స్నేహితులు. గత కొంతకాలంగా వీరు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, డబ్బు వసూలు చేసి మోసం చేస్తున్నారు.
 
డబ్బు తిరిగి చెల్లించమని అడిగిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని ప్లాట్లు, భూమి డాక్యుమెంట్లను తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్రాజు కందుల గోపాల్ ద్వారా ప్రశాంత్‌కు ఉద్యోగం కోసం రూ.12.65 లక్షలు చెల్లించాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయమని కోరిన వెంకట్రాజును నాటు తుపాకీతో చంపుతానని ప్రశాంత్ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితుడు కొద్దిరోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసుల సహాయంతో సోమవారం ఉదయం హుడాకాలనీలోని ప్రశాంత్ ఇంటిపై దాడి   చేశారు. అతనితో పాటు మరో నిందితుడు గోపాల్‌ను కూడా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో దాదాపు 10 మంది నిరుద్యోగుల వద్ద మొత్తం రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్‌కు తరలించారు.  నిందితుల నుంచి కంట్రిమేడ్ పిస్టల్, రివాల్వర్‌లతో పాటు మూడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, సఫారీ వాహనం స్వాధీనం చేసుకున్నారు.
 
బాధితుల్లో శ్రావణ్ అనే ఎన్‌ఆర్‌ఐ కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. ముఠాలోని మరో నిందితుడు తేజ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్, ఎస్‌ఓటీ ఏసీపీ అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సైలు సైదేశ్వర్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిరుద్యోగుల నుంచి దండుకున్న డబ్బుతో తన చెల్లెళ్ల పెళ్లి చేశానని ప్రధాన నిందితుడు ప్రశాంత్ పోలీసులకు తెలిపాడు. పెళ్లిళ్లు చేసే స్తోమత లేకపోవడంతోనే మోసాలకు పాల్పడ్డానన్నాడు.

మరిన్ని వార్తలు