ఫలితాలిస్తున్న పీడీఏ మిషన్లు

21 Aug, 2013 02:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఏటా నగర ట్రాఫిక్ విభాగం జారీ చేస్తున్న ఈ-చలాన్లలో 25 శాతం తిరిగి వచ్చేస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న చిరునామాలో వాహనచోదకులు ఉండకపోవడమే దీనికి  కారణం. ఫలితంగా ఈ ఏడాది మార్చి నాటికి ట్రాఫిక్ విభాగం వద్ద పాతిక లక్షలకు పైగా ఈ-చలాన్‌లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు కొనుగోలు చేసిన పీడీఏ మిషన్లు దీనికి పరిష్కారంగా మారాయి. సుదీర్ఘ కాలంగా ఉండిపోయిన భారీ మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి.

వాహన చోదకులు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య ఘర్షణలకు లేకుండా ఉండేందుకు కెమెరా లు, సర్వైలెన్స్ కెమెరాలు, రెడ్‌సిగ్నల్ వైలేషన్ సిస్టం వంటిని ఆధునిక పరికరాలను వినియోగించి నాన్-కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచారు. వీటిలో రికార్డు అయ్యే ఉల్లంఘనలకు ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా ఈ-చలాన్స్ పంపిస్తా రు. ఇలా వెళ్తున్న ఈ-చలాన్లలో నిత్యం 25 శాతం తిరిగి ట్రాఫిక్ విభాగానికే తిరిగి వచ్చేస్తుండటంతో పెండెన్సీ పెరిగిపోయింది.
 
చిరునామా చిక్కకపోవడానికి కారణాలెన్నో..
 కొత్తవాహనం రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో వ్యక్తిగత ధ్రువీకరణతో పాటు స్థానిక చిరునామా ధ్రువీకరణను సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత గుర్తింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. చిరునామా దగ్గరకు వచ్చేసరికి సమస్య వస్తోంది. నగరంలో నివసిస్తున్న వారిలో దాదాపు 60 శాతం అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారే. వీరు తమ అవసరాలను బట్టి అనేక ప్రాంతాలకు మారుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ గుర్తింపు కార్డులో ఉన్న చిరునామా మరో దాంట్లోకి వచ్చేసరికి మారిపోతోంది.

 మరోపక్క సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసిన వారిలో చాలామంది వాటి రిజిస్ట్రేషన్లను తమ పేరు, చిరునామాపై మార్చుకోవడం లేదు. ఫలితంగా వాహనాన్ని అమ్మేసి ఏళ్లు గడిచినా అవి పాత యజమానుల పేర్లతో ఉండిపోతున్నాయి. ఫలితంగా ఆ వాహనాలకు జారీ చేసిన ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.
 
ఆధునిక పీడీఏలతో వసూళ్లు..
 నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అత్యాధునిక పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ (పీడీఏ) మిషన్లను ఈ ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చారు. గతంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారుల వద్ద చలాన్ పుస్తకాలతో పాటు పీడీఏలు ఉండేవి. జంక్షన్లు, ఇతర పాయింట్ డ్యూటీల్లో ఉండే సిబ్బంది ఉల్లంఘనులకు జరిమానాలు (స్పాట్ చలాన్) విధించడం కోసం చలాన్ పుస్తకాలను వాడేవారు. నాన్-కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా కెమెరాల్లో చిక్కిన ఉల్లంఘనులకు ఈ-చలాన్‌లు పంపుతున్నారు. ఓ వాహనంపై ఇవి పెండింగ్‌లో ఉన్నాయా? లేదా? అనేది సరిచూడటం కోసం పీడీఏ మిషన్లు వినియోగించే వారు.

ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక పీడీఏ మిషన్ల ద్వారా కేవలం పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్స్‌ను మాత్రమే కాకుండా స్పాట్ చలాన్లను కూడా విధించవచ్చు. చెల్లింపులకు నగదునే ఇవ్వాల్సిన అవసరం లేకుండా డెబిడ్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. వీటిసాయంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనులతో పాటు పాత బకాయిలు ఉన్న వారినీ ఎప్పకప్పుడు పట్టుకుని వసూలు చేయడం ప్రారంభించారు. బకాయి చెల్లించకుంటే వాహనం స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులకు చిక్కిన వారు అప్పటికప్పుడే డబ్బు చెల్లించేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు