ఈ-టికెట్ల అక్రమ విక్రయం

12 Aug, 2013 01:33 IST|Sakshi

సికింద్రాబాద్, న్యూస్‌లైన్: రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీ సీలో బినామీ యూజర్ ఐడీలు తెరిచి.. తత్కాల్‌లో టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురిని రైల్వే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆదివారం ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ అశ్వినీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రయాణికులు రైల్వే ఈ-టికెట్ తీసుకొనే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. దీని కోసం ప్రయాణికులు యూజర్ ఐడీలను తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ-టికె ట్లను పెద్దమొత్తంలో తీసుకొని ఇతరులకు విక్రయించాలనుకుంటే మాత్రం ఐఆర్‌సీటీసీ వద్ద ఏజెంట్‌గా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సికింద్రాబాద్ పికెట్‌కు చెందిన ఎజ్జు శ్రీనివాసరావు (38), ముషీరాబాద్ ఓన్లీ ట్రావెల్స్‌కు చెందిన నస్రతుల్లా (50), హబ్సిగూడ తిరుమల ఇంటర్నెట్ నిర్వాహకుడు నల్ల చంద్రశేఖర్ (21), రామంతాపూర్‌కు చెందిన ఎన్.రాధాకృష్ణ శ్రీనివాస్ (48) ఐఆర్‌సీటీసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఏజెంట్లుగా చెప్పుకుంటూ ప్రయాణికులకు తత్కాల్ ఈ-టికెట్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఐఆర్‌సీటీసీలో ఒక్క యూజర్ ఐడీపై ఎక్కవ టికెట్లు బుక్ చేసుకొనే సదుపాయం లేకపోవడం.. బినామీ పేర్లపై యూజర్ ఐడీలు తెరిచి ప్రతీ రోజూ ఎక్కవ సంఖ్యలో తత్కాల్ ఈ-టికెట్లు తీసుకొని అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ పోలీసులు దాడి చేసి పై నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.11 వేలు విలువైన తత్కాల్ ఈ-టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు