పెన్షనర్ల గోడు పట్టని సర్కారు

10 May, 2016 03:44 IST|Sakshi
పెన్షనర్ల గోడు పట్టని సర్కారు

సాక్షి, హైదరాబాద్: పెన్షనర్ల గోడును రాష్ట్ర సర్కారు పట్టించుకోవటం లేదు. రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ చెల్లింపులను నిలిపివేసింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా పెండింగ్‌లో పెట్టింది. దీంతో దాదాపు ఎనిమిది వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారంటూ పది నెలలుగా సెక్రటేరియట్‌లో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.8 లక్షలున్న గ్రాట్యుటీని రూ.12 లక్షలకు పెంచు తూ గతేడాది జూలైలోనే ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచే పెరిగిన ఈ గ్రాట్యుటీ వర్తిస్తుంది. 2015 మార్చి నుంచి రిటైరైన వారికి నగదు రూపంలో చెల్లిస్తామని, 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్యలో రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లిస్తామని అప్పటి ఉత్తర్వుల్లోనే స్పష్టం చేసింది. గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తామని అందులో తెలిపింది. పది నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకపోగా.. అసలు ఆ ఊసెత్తకుండానే ఫైలు అటకెక్కించింది. దీంతో గ్రాట్యుటీ బకాయిల చెల్లింపులు ఆగిపోయాయి.

 అప్పుడు రిటైరైన వారికే ఇబ్బంది
 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి మధ్య తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులందరూ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలు వస్తాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఎవరికి వారుగా ఆర్థిక శాఖకు వెళ్లి తమ ఫైలు ఎప్పుడు కదులుతుంది.. ఎప్పుడు జీవో విడుదలవుతుంది..? అని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పీఆర్‌సీ ప్రకటించిన తర్వాత రిటైరైన ఉద్యోగులందరికీ ప్రభుత్వం క్రమం తప్పకుండా రూ.12 లక్షల చొప్పున గ్రాట్యుటీని చెల్లిస్తోంది. అంతకుముందు రిటైరైన వారందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. వీరిలో కొందరికి పాత గ్రాట్యుటీ ప్రకారం రూ.8 లక్షలు చెల్లించినప్పటికీ.. మిగతా బకాయిలు ఆగిపోయాయి. ఈ విధంగా నిలిపేసిన గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లించాలంటే దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అవసరమని గతంలోనే ఆర్థిక శాఖ అంచనాలు వేసుకుంది. కానీ గత ఏడాది నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతమొత్తం చెల్లించటం కుదరదని పెండింగ్‌లో పెట్టింది. ముందుజాగ్రత్తగా జీవో కూడా జారీ చేయలేదు.
 
 పెన్షన్ బకాయిలకు మోక్షం లేదు
 రాష్ట్రంలోని పెన్షన్‌దారులందరికీ తొమ్మిది నెలల పెన్షన్ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలకు సంబంధించి తొమ్మిది నెలల బకాయిలను ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. వీటికి దాదాపు రూ.2,500 కోట్లు అవసరమవుతాయి. భారీ మొత్తం కావటంతో ఆర్థిక శాఖ వీటిని చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. బకాయిలు నగదుగా ఇవ్వాలా, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా అనే చర్చకు తెర లేపి ఈ సమస్యను జటిలం చేసింది. పెన్షన్‌దారులతో పాటు కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేనందున నగదు రూపంలో చెల్లింపులు చేయడం తప్పనిసరి. ఈ బకాయిలు కూడా వీలైనంత తొందరగా చెల్లించాలని పెన్షన్‌దారులు అధికారులను వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు