డేంజర్ నాలాట

26 Oct, 2015 00:58 IST|Sakshi
డేంజర్ నాలాట

సిటీలో పొంచి ఉన్న ముప్పు
 

వందల ఏళ్ల చరిత్ర గల భాగ్యనగరంలో అడుగుకో సమస్య కనిపిస్తుంది. ఐటీ రంగంలో ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేసిన హైటెక్ సిటీ మౌలిక వసతుల కల్పనలో తీసికట్టుగా మారింది. కోటిమంది జనాభాకు చేరువైన నమ నగరంలో పాలకుల నిర్లక్ష్యం బుసలు కొడుతోంది. కాలనీల్లో ఓపెన్ నాలాలు కోరలు సాచి ప్రజలను కాటేస్తున్నాయి. చినుకు పడితే చెరువులను తలపించే రహదారులు..
 కొద్ది పాటి వర్షానికే ఉగ్రరూపం దాల్చే నాలాలు ప్రాణసంకటంగా మారాయి.

దుర్ఘటన జరిగినప్పుడు నాయకులు ఇచ్చే హామీలు ఒట్టి ‘కోతలే’ అన్న చందంగా మిగిలాయి. ఆర్నెల్ల క్రితం నల్లవాగు సంజయ్ అనే బాలుడిని పొట్టనబెట్టుకుంది. ఐదేళ్ల క్రితం కుత్బుల్లాపూర్‌లో ఓపెన్ నాలా చారి అనే వ్యక్తి ప్రాణాలు మింగింది. ఇన్ని జరుగుతున్నా అధికారుల్లో చలనం ఉండదు. పాలకుల తీరులో మార్పు రాదు. పాలకుల్లో చలనం తీసుకువద్దాం.. మనం ఎదుర్కొంటున్న సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ప్రాంతంలో ప్రధానమైన
 ప్రజా సమస్యను ‘సాక్షి’ దృష్టికి తీసుకురండి.
 
 
ఓపెన్ నాలా.. ఎన్నాళ్లిలా..
కుత్బుల్లాపూర్: అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతోంది.. ప్రాణాలు పోతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. జీడిమెట్ల నుంచి పాపయ్య యాదవ్‌నగర్ వరకు ఉన్న నాలా విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో 2010లో కురిసిన భారీ వర్షాలకు వెంకటేశ్వర్ నగర్‌లో ఓ ఉపాధ్యాయుడు నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయినా నాలా పనులు ముందుకు సాగలేదు. రూ. 4.5 కోట్లతో ప్రారంభించిన ఈ పనులు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాగుతునే ఉన్నాయి.
 
ప్రమాదపుటంచున కాలనీలు
నాగోలు: ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఉన్న ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా మారాయి. పైకప్పు లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు నాలాలు కనిపించక పాదచారులు అందులో పడి గాయపడ్డ సంఘటనలు ఉన్నాయి. మన్సూరాబాద్, సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్‌కేపురం, కర్మన్‌ఘాట్, హయత్‌నగర్ డివిజన్లలో ఓపెన్ నాలాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వాటిపై కప్పులు వేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పిన మాట ఆచరణ పెట్టలేదు. చెత్తతో పూడుకుపోయి మురుగు కాలనీల్లోని ఇళ్లల్లో చేరుతోందని బండ్లగూడలోని త్యాగరాయనగర్, అయ్యప్పనగర్ ప్రజలు వాపోతున్నారు. ఓపెన్ నాలాలోని మురుగు నుంచి విపరీతమైన దుర్వాసన వెలువడుతోంది. వీటిపై పైకప్పు వేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు.
 
దుర్వాసనతో సావాసం..

మోతీనగర్: మోతీనగర్ డివిజన్‌లో బబ్బుగూడ, రామారావునగర్, స్నేహపురికాలనీ, లక్ష్మీనగర్, గాయత్రినగర్‌లో ఉన్న ఓపెన్ నాలాల్లో తరచూ కాలనీల్లోని చిన్న పిల్లలు, పశువులు పడి గాయాల పాలవుతున్నారు. నాలాపై ఎలాంటి కప్పుగాని, రక్షణ గోడలు లేకపోవడంతో చిన్నారులను బయటకు పంపించాలంటే వారి తల్లిదండ్రులు జంకుతున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులు ఇంట్లోని వస్తువులను తెచ్చి ఈ ఓపెన్ నాలాలో పడేస్తున్నారు. కాలనీల్లోని మహిళలు చెత్తను సైతం నాలాలోనే వేస్తుండడంతో మురుగునీరు పారుదలకు అడ్డం పడుతోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు చుట్టం చూపుగా ఒకసారి వచ్చి చూసిపోతున్నారే గాని పైకప్పు వేయాలన్న తలంపు చేయడం లేదు. అప్పుడప్పుడు నాలాలో తీసిన మట్టిని పక్కనే వేస్తుండడంతో వర్షానికి అది తిరిగి నాలాలోకే వెళుతోంది. ఎన్నికల సమయంలో నేతలు ఓపెన్ నాలాపై పైకప్పు వేయిస్తామని హామీ ఇవ్వడం.. అమలు చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగి సమీపంలోని నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 ఉస్మాన్‌గంజ్‌లో
 అబిడ్స్: ఉస్మాన్‌గంజ్ ఓపెన్‌నాలా స్థానికులకు ప్రాణసంకటంగా మారింది. అఫ్జల్‌సాగర్ నుంచి వస్తున్న ఈ నాలా గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ మీదుగా ఉస్మాన్‌గంజ్ నుంచి ఇమ్లిబన్ మూసీలో కలుస్తుంది. ఉస్మాన్‌గంజ్‌లోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న ఈ నాలా అటూ ఇటూ వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాగా వర్షాకాలంలో నాలా నిండడంతో వర్షపునీరు ఇళ్లలోకి, రోడ్లపైకి ప్రవహిస్తోంది. వర్షం పడినప్పుడల్లా ఈ ఓపెన్ నాలాతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఇటీవల వర్షాలకు నాలాలోని నీరు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది.
 
 వర్షం వస్తే ప్రమాదమే..
 గచ్చిబౌలి: గచ్చిబౌలి నాలాకు పైకప్పు లేకపోవడంతో వాహనదారులు, పాదాచారులకు ప్రమాదకరంగా మారింది. వర్షం వచ్చినప్పుడు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ఒపెన్ నాలా ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ సమయంలో ఎవరూ ఈ రోడ్డులో వెళ్లేందుకు సాహసించడం లేదు. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బరంకుంట నుంచి ఖాజాగూడ పెద్ద చెరువు వరకు గచ్చిబౌలి నాలా విస్తరించి ఉంది. ఇందిరానగర్, గచ్చిబౌలి, గుల్షన్ నగర్, పీజేఆర్ నగర్, జనార్దన హిల్స్, డైమండ్ హిల్స్ మీదుగా ఇది ప్రవహిస్తుంది. దశాబ్ధాలు గడిచినా నాలాకు పైకప్పు వేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒపెన్ నాలాను కొన్ని చోట్ల కబ్జా చేశారు. గచ్చిబౌలిలోని హెచ్‌పీ గ్యాస్ ఆఫీస్ సమీపంలో వర్షం వస్తే నాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. రోడ్డుపై రెండున్నర అడుగుల ఎత్తున వరద ప్రవహించడంతో నాలా, రోడ్డు కలిసిపోతున్నాయి.
 
 ప్రాణాలకు ‘రక్షణ’ లేదు..
 మూసాపేట: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఓపెన్ నాలా హుస్సేన్ సాగర్‌లోకి ప్రవహిస్తుంది. అయితే దీనికి పలుచోట్ల రక్షణ గోడగాని, ఇనుప కంచె గాని లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్‌దయాళ్ నగర్‌లో రోడ్డు కింది నుంచి ఓపెన్ నాలా ప్రవహిస్తుంది. ఇది రోడ్డుకు సమాంతరంగా ఉంది. కానీ గ్రేటర్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోతున్నారు. భరత్‌నగర్ కూరగాయాల మార్కెట్ వద్ద మరీ ప్రమాదకరంగా ఉంది. మార్కెట్ రైతులు, వినియోగదారులతోను, జింకలవాడకు వెళ్లే ప్రజలతోను నిత్యం రద్దీగా ఉంటుంది. భవన నిర్మాణ వ్యర్థాలను నాలా పక్కన పోయడంతో మట్టి జారి కాలువలోకి జారుతోంది. పాదచారులు కూడా ఈ మట్టిపై వెళుతూ నాలాలోకి జారి పడిపోతున్నారు. రాజీవ్‌గాంధీనగర్ నుంచి ప్రశాంత్ నగర్ మార్గంలో ప్రజలు చెత్తను ఓపెన్ నాలాలో వేస్తున్నారు. దీంతో కాలువ మొత్తం పూడుకుపోయింది. కొట్టుకు వస్తున్న పరిశ్రమల వ్యర్థాల వాసన తట్టుకోలేక అవస్థలు పడుతుంటే, ఈ చెత్త కుళ్లి మరింత దుర్వాసన వెదజల్లుతూ రోగాలను పెంచుతోంది.
 
నిత్యం భయం..భయం..

సైదాబాద్: వర్షం వస్తే రోడ్డు ఎక్కడో.. నాలా ఎక్కడో తెలియని పరిస్థితి. అడుగు తడబడితే పాణాలు పోతాయి. ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్ సెల్ ఆఫీస్ ప్రాంతాలలో ఓపెన్ నాలాలు స్థానిక ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాకాలంలో ఇక్కడి కాలనీలు చెరువులను తలపిస్తాయి. వరదనీటితో ఇంటికి వెళ్లే దారి మూసుకుపోతుంది. మెకాళ్ల లోతు వర్షపునీటితో నిండిపోతుండడం అడుగు బయట పెట్టాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇది చాలదన్నట్లు ఇక్కడ రెండు ఓపెన్ నాలాలు. మీటర్ సెల్ ఆఫీస్ ముందు ఒకటి, సింగరేణి ఆఫీసర్స్ కాలనీ నుంచి గ్రీన్‌పార్క్ కాలనీ వెళ్లేదారిలో మరోటి ఉంది. ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు, మీటర్‌సెల్ ఆఫీస్, ఏటీఎం సెంటర్లు ఉండటంతో నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. వర్షపు నీటికి ఈ నాలాలు పొంగి దారి కనిపించని పరిస్థితి. ఈ సమయంలో వచ్చి చూసి పోయే అధికారులు తర్వాత ఏం చర్యలు తీసుకోవడం లేదు.
 
బుసకొడుతున్న నల్లవాగు
చాంద్రాయణగుట్ట: నల్లవాగు నాలాకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. నాలుగేళ్ల క్రితం 17 మీటర్ల మేర నాలా విస్తరణకు జీహెచ్‌ఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పల్లె చెరువు దిగువ నుంచి ప్రారంభమయ్యే ఈ నాలా బండ్లగూడ, ఫలక్‌నుమా, పూల్‌బాగ్, అహ్మద్ కాలనీ, పార్వతీనగర్, సాయిబాబానగర్, అరుంధతి కాలనీ, భయ్యాలాల్ నగర్, మహ్మద్‌నగర్, యాకుత్‌పురా, డబీర్‌పురా మీదుగా ప్రవహించి మూసీ నదిలో కలుస్తుంది. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి నుంచి ఉప్పుగూడ లక్కీ స్టార్ హోటల్ వరకు నాలా విస్తరణ పనులు పూర్తి కావడంతో అధికారులు రక్షణ గోడ నిర్మించారు. కాని అక్కడి నుంచి సమస్య మొదలవుతోంది. అహ్మద్ కాలనీ నుంచి అరుంధతి కాలనీ వరకు కొనసాగాల్సి ఉంది. నాలాకి ఇరువైపులా ఇళ్లను కోల్పోతున్న బాధితులకు సరైన పరిహారం చెల్లించక పోవడంతో ఈ విస్తరణ పనులు ఆగిపోయాయి. దీంతో పలు కాలనీల్లో నాలాకు రక్షణ గోడ నిర్మించలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 14న రాజీవ్‌గాంధీ నగర్‌లో బస్తీ చిన్నారులు నాలా పక్కన క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ బంతి వెళ్లి నాలా ఒడ్డున పడడంతో దానికోసం వెళ్లిన సంజయ్ (7) నాలాలో పడి మృతి చెందాడు. ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ సర్వసాధారణమయ్యాయి.
 
శివారుకు పెద్ద గండం

నాచారం: చినుకు పడితే నాచారం పెద్ద నాలా స్థానికులకు కునుకు లేకుండా చేస్తుంది. ఇక్కడి పటేల్‌కుంట చెరువు నుంచి ప్రారంభమైన నాలా కిలో మీటర్ పొడవునా పలు కాలనీలలో మధ్య నుంచి ప్రవహించి హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువులో కలుస్తుంది. ఈ నాలాకు రక్షణ కంచె లేక పోవడంతో తరచు జీవాలు, వాహనదారులు పడిపోతున్నారు. గతేడాది అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. కంచె లేకపోవడంతో స్థానికులు చెత్తను ఇందులోనే పడేస్తున్నారు. చిన్న వర్షానికే నాలాలో నీరు పోటెత్తి రోడ్డును ముంచెత్తుతుంది. దీంతో రాక పోకలు నిలిచిపోతున్నాయి.
 
 
ఈ నాలా యమ డేంజర్..
ఉప్పల్: హెచ్‌ఎంటీనగర్ పెద్ద చెరువు నుంచి దిగువ ఉన్న ఉప్పల్ ప్రాంతానికి  మూడు కిలోమీటర్ల మేర నాలా విస్తరించింది. ఈ నాలా నీరు హైకోర్టు కాలని, కళ్యాణపురి మీదుగా, స్వరూప్ నగర్ నుంచి నల్ల చెరువుకు చేరుతుంది. దారిలో 30 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన నాలా కేవలం పది  ఫీట్ల వెడల్పు మాత్రమే మిగిలింది. కొన్ని చోట్ల అదికూడ లేదు. నాలుగేళ్ల క్రితం క్రికెట్ ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు నాలాలో పడి చనిపోయారు. అయినా ఇప్పటి దాకా నాలాకు రక్షణ కంచె మాత్రం నిర్మించలేదు.
 
ఈ దుస్థితిని ఏమ‘నాలా’..

జూబ్లీహిల్స్: యూసుఫ్‌గూడ మీదగా అమీర్‌పేట మైత్రీవనం వద్ద కలిసే ఓపెన్ నాలా ప్రజలను భయపెడుతోంది. పూడుక పేరుకుపోయి మురుగు ప్రవాహం కదలని పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే పొంగి ఇళ్లను ముంచెత్తుతుంది. దీంతో ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో నివసించే వారు వరద ముంపుతో అవస్థలు పడుతున్నారు. ప్రతిఏటా తప్పనిసరిగా పూడిక తీయాల్సి ఉన్నా కొన్నేళ్లుగా ఆ సంగతే పట్టించుకోవడం మానేశారు. సమస్యను పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
 

మరిన్ని వార్తలు