గడువు మూడు రోజులే..!

29 Aug, 2013 03:07 IST|Sakshi
గడువు మూడు రోజులే..!

సాక్షి, సిటీబ్యూరో: ఇక మూడు రోజులే గడువు. గ్రేటర్ హైదరాబాద్‌లో సబ్సిడీ ఎల్పీజీతో ఆధార్ అనుసంధానానికి ఈనెల 31 (శనివారం)తో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ కింద ఎల్పీజీ కనెక్షన్లు ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైంది 34 శాతమే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 3 నెలలుగా ప్రయోగాత్మకంగా సబ్సిడీ ఎల్పీజీకీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకం అమలవుతున్నా... అనుసంధాన ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. గడువులోగా ఆధార్ పొందని గ్యాస్ వినియోగదారులు.. గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుక్కోవాల్సి ఉంటుంది.   
 
 మూడేళ్లుగా నమోదు ప్రక్రియ..


 గ్రేటర్‌లో 2010 సెప్టెంబరు నుంచి ఆధార్ నమోదు ప్రక్రియ నమోదైంది. అప్పట్లో 136 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సాఫ్ట్‌వేర్ హాలిడే ప్రకటించటంతో ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి సెప్టెం బరు నుంచి కేంద్రాల్ని ప్రారంభించారు. సబ్సిడీ గ్యాస్ ఆధార్‌తో అనుసంధానం కావటం తప్పనిసరి అని ప్రకటించటంతో ఆధార్ ప్రాధాన్యం పెరిగింది. కాగా, ఒకపక్క జనాభాకు మించి ఆధార్‌లో పేర్లను నమోదు చేసుకొని ఐరిస్ ఫొటోలు దిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

వాస్తవంగా చూస్తే ఇప్పటికీ గ్రేటర్ మొత్తం మీద 52 లక్షల మందికి మించి ఆధార్ అందలేదు. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల మంది ఫొటో డేటా ఎంట్రీ గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరంతా వెబ్‌సైట్‌లో ‘స్టేటస్’లో కోసం అన్వేషిస్తే ‘ఎర్రర్’ అని బదులొస్తోంది. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 4.68 లక్షల (హైదరాబాద్: 2,36, 622- రంగారెడ్డి: 2,31,984) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. పేర్ల నమోదులో తేడా, వేలిముద్రల్లో లోపాలు, స్టాఫ్‌వేర్ పనితీరు వంటివి ఇందుకు కారణాలు.

 నమోదులో నిర్లక్ష్యం...


 ఎల్పీజీ వినియోగదారుడు ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలు సమర్పించిన తక్షణమే నమోదు జరగాలి. కానీ, డీలర్లు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో అది సరిగా జరగట్లేదు. ఒకవైపు డీలర్ల వద్ద ఎల్పీజీ సీడింగ్ 65 శాతం పూర్తయితే బ్యాంకర్ల వద్ద 34 శాతం మించట్లేదు. దీంతో కొందరు సబ్సిడీకి నోచుకోవటం లేదు. ఇక, ఆధార్ అనుసంధానంపై పౌరసరఫరాల, బ్యాంకు అధికారుల లెక్కలకు పొంతన లేదు. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో 65 శాతం వరకు ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానమైట్లు చెబుతున్నా పౌరసరఫరాల అధికారులు 34 శాతం మించి కాలేదంటున్నారు. బ్యాంకర్లు తాము 55 శాతానికి మించి ఖాతాలను అనుసంధానం  చేశామంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో 6,73,482 మంది బ్యాంక్ ఖాతాతో ఎల్పీజీ ఆధార్ అనుసంధానమైనట్లు బ్యాంకర్లు చెబుతుండగా, ఎన్‌పీసీఎల్ మాత్రం 4,13,487 ఖాతాలే అయ్యాయంటోంది.
 
 అనుసంధానం తప్పనిసరి
 ఎల్పీజీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవటం తప్పనిసరి. అలా చేసుకోని వినియోగదారులు సబ్సిడీకి దూరం కావడం ఖాయం.
 - డాక్టర్ పద్మ, సీఆర్‌వో, హైదరాబాద్
 
 ఆదివారం కూడా బ్యాంకులు
 వినియోగదారుల కోసం ఆదివారమూ బ్యాంకులు నడిపిస్తున్నాం. జీరో ఖాతాల ప్రారంభానికి వీలు కల్పించాం. డీలర్ల వద్ద డ్రాప్ బాక్స్‌లు ఉంచాం.
 - భరత్‌కుమార్, చీఫ్ మేనేజర్, లీడ్‌బ్యాంక్, హైదరాబాద్
 

>
మరిన్ని వార్తలు