మూడు తరాల బుల్లెట్ జనం మెచ్చిన రాకెట్

15 Mar, 2015 04:23 IST|Sakshi
మూడు తరాల బుల్లెట్ జనం మెచ్చిన రాకెట్

- వన్నె తగ్గని రాయల్ ఎన్‌ఫీల్డ్    
- నగరంలో పెరుగుతున్న విక్రయాలు
- హార్లీడేవిడ్ కంటే పైచేయి     
- దశాబ్దాలుగా తరగని ఆదరణ

సాక్షి, సిటీబ్యూరో: బుల్లెట్... ఈ పేరులోనే ఏదో ఠీవి. ఏ వాహనానికీ లేని ప్రత్యేకత దీని సొంతం. ఎన్నో ఏళ్లుగా వాహన ప్రియుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బుల్లెట్...

హైదరాబాద్ రోడ్లపైనా దర్పాన్ని ప్రదర్శిస్తోంది. రూ.లక్షల విలువైనస్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్, వాయువేగంతో పరుగులు పెట్టే వాహనాలు ఎన్ని వచ్చినా... రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ క్రే జ్ ఏమాత్రం తగ్గలేదు. టీనేజ్ కుర్రాళ్లు... అమ్మాయిల నుంచి అరవయ్యో పడిలో పడిన ‘పెద్దల’ వరకు దీనిపై సవారీకి సై అంటున్నారంటే... ఆ ప్రత్యేకత ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు.

బుల్లెట్‌కు హైదరాబాద్ బ్రహ్మరథం పడుతోంది. స్పోర్ట్స్ యుటిలిటీ బైక్స్, హార్లీడేవిడ్‌సన్ వంటివి పోటాపోటీగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నా...వీటి అమ్మకాలు ఇసుమంతైనా తగ్గలేదు సరికదా... రోజు రోజుకు పెరగుతుండడం గమనార్హం. ఆ మాటకొస్తే ఒక్క నగరంలోనే కాదు... అంతటా బుల్లెట్ శరవేగంగా దూసుకె ళ్తోంది. సుఖవంతమైన  ప్రయాణానికి, కొండలు, కోనలు, రాళ్లు, గుట్టల్లో సైతం నిశ్చలంగా సాగిపోయేందుకు పెట్టింది పేరైన బుల్లెట్ అభిమానులు, క్లబ్‌లు నగరంలో కోకొల్లలు. కా్లాసిక్, ఎలక్ట్రా మోడల్ బుల్లెట్‌లకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది.   
 
అమ్మకాలు అదరహో...
ఏటా నగరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇండియా బుల్లెట్ అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆధునికీకరించిన తరువాత మరింత ఆదరణ పెరిగింది. నగరంలో నిత్యం 300 నుంచి 350 బుల్లెట్లు విక్రయమవుతున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల బుల్లెట్లు మార్కెట్‌లోకి వచ్చినట్టు రవాణా శాఖ అంచనా. ‘స్పోర్ట్స్ యుటిలిటీ, హార్లీడేవిడ్‌సన్ వంటివి ఒక నెలలో 100 వాహనాలు రిజిస్ట్రేషన్ కావడం కూడా  కష్టమే. బుల్లెట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన  తరువాత నగరంలో అమ్మకాలు బాగా పెరిగాయ’ని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ తెలిపారు.ఎక్కువ శాతం 350 సీసీ ఇంజన్ సామర్ధ్యం ఉన్న క్లాసిక్, ఎలక్ట్రా మోడల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

వీటి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకూ ఉంది. 500 సీసీ సామర్ధ్యం గలవి మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ పెద్దగా ఆదరణ లభించడం లేదు. 350సీసీ బుల్లెట్లు  53 కిలోమీటర్‌ల వరకు మైలేజీ ఇస్తుండగా... 500 సీసీ వాహనాలు 35 కిలోమీటర్లకే పరిమితమవుతున్నాయి. నలుపు రంగు, డిసర్ట్  ప్రస్తుతం నగరంలో లభిస్తున్నాయి. ఎక్కువ మంది ఇష్టపడే ఆర్మీ గ్రీన్ మాత్రం ఇంకా హైదరాబాద్ మార్కెట్‌కు పరిచయం కాలేదు. ప్రస్తుతం ఇవి చెన్నైలో మాత్రమే లభిస్తున్నాయి. త్వరలో నగరంలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని డిమాండ్ దృష్ట్యా నగరంలోని వాహనదారులు పేరు నమోదు చేయించుకున్నాక... నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.  
 
ఎంతో విశిష్టత...
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్థానమే విశిష్టం. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ 1816లో  రైఫిల్, మస్కట్, ఖడ్గం వంటి ఆయుధాలను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించింది. వాహన రంగంలోకి ఇది ప్రవేశించిన తరువాత రెవీలీషన్ , క్వాడ్రా సైకిల్ వంటివి వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఆయుధాలతో పాటు, యుద్ధ అవసరాలు తీర్చే వాహనాలను ఎన్‌ఫీల్డ్ రూపొందిం చింది.  సరిహద్దు పెట్రోలింగ్‌కు బుల్లెట్‌లకు రూపాన్నిచ్చింది. మొదట్లో 800సీసీ సామర్థ్యంతో నడిచేద.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జన సామాన్యంలోకి చొచ్చుకువచ్చింది. యుద్ధ అవసరాల కోసమే భారత ప్రభుత్వం మొదట్లో ఈ వాహనాలను కొనుగోలు చేసింది. బ్రిటన్ నుంచి విడిభాగాలను తెచ్చి ఇక్కడ వాహనాలను తయారు చేసి విక్రయించేవారు. 1960 నాటికి బుల్లెట్ అందరికీ చేరువైంది. సైన్యంతో పాటు పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు బుల్లెట్ నడపడం ఒక హోదాగా భావించేవారు. ఇప్పటికీ అదే క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. మిగతా వాహనాల కంటే భిన్నమైన దీని శబ్దమూప్రత్యేక ఆకర్షణే.
 
బుల్లెట్ ప్రియుల క్లబ్‌లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ప్రియులు నగరంలో ప్రత్యేక క్లబ్‌లుగా ఏర్పడ్డారు. ఇలా ఆవిర్భవించిన వాటిలో మొట్టమొదటిది వాండరర్స్ క్లబ్. ఈ క్లబ్‌లోని వందలాది సభ్యులు తరచూ లాంగ్ డ్రైవ్ కు వెళ్తుంటారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, జైసల్మీర్, చండీఘర్, లడఖ్,లేహ్ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఘాట్‌రోడ్లపై సాహసోపేతమైన ప్రయాణం గొప్ప అనుభూతిగా వీరు చెబుతుంటారు. బుల్లెట్ క్లబ్‌లో అన్ని వయస్సుల వారు ఉన్నారు. వాండరర్స్ తరువాత వుల్ఫ్‌ఫ్యాక్స్, హైవే నవాబ్స్, మహిళలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న బైకర్నీస్ బుల్లెట్ క్లబ్ బుల్లెట్ విశిష్టతను చాటి చెబుతోంది. అమ్మాయిలు ఈ క్లబ్‌లో చేరడం ద్వారా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని చాటుతున్నారు.
 
కల తీరింది
చిన్నప్పటి నుంచి బుల్లెట్ నడపాలనేది నా కల. నేను దక్షిణ మధ్య రైల్వే కేంద్రీయ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరిన తరువాత దాన్ని సాకారం చేసుకున్నాను. అప్పటి నుంచి బుల్లెట్ నా జీవితంలో ఒక భాగమైంది.
 - డాక్టర్ ప్రహ్లాద్, రైల్వే ఆస్పత్రి (రిటైర్డ్)
 
మాటల్లో చెప్పలేం
కొండ కోనల్లో, ఘాట్‌రోడ్లపైన పరుగులు తీస్తుంటే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఏటా ఏదో ఒక ప్రాంతానికి లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటాం. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
 - దిలీప్‌రాజ్, వాండరర్స్ క్లబ్ పూర్వ సభ్యులు
 
లాంగ్ డ్రైవ్ ఎంతో ఇష్టం
చిన్నప్పటి నుంచి బైక్ నడుపుతున్నా. లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. ఎంతో ఉత్తేజంగా అనిపిస్తుంది. వారాంతంలో ఏదో ఒక చోటుకు వెళ్లి రావడం వల్ల మిగతా పని దినాల న్నీ హాయిగా సాగిపోతాయి.     - జైభారతి

మరిన్ని వార్తలు