మూడు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్

14 Aug, 2016 01:15 IST|Sakshi
మూడు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం రానున్న 3 నెలల్లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నగరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరిగేందుకు ఈ మాస్టర్ ప్లాన్ ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. తెలంగాణ  ఏర్పడిన కొత్తలో నిర్మాణ రంగంపై పలు అనుమానాలు చోటు చేసుకున్నాయని,   వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ దేశాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రస్తుతం నిర్మాణ రంగం అభివృద్ధి చెందిందన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం 5వ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణ సంస్థలు దేశవ్యాప్తంగా వ్యాపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం నిర్మాణాల్లో సామాజికంగా ఆలోచించి నిర్మాణ సంస్థలు తమతో కలసి పనిచేయాలని సూచించారు. నిర్మాణ రంగానికి సంబంధించి ఒకే రోజు 41 జీవోలు పాస్ చేశామని, 30 రోజుల్లో అన్ని అనుమతులను ఆన్‌లైన్ ద్వారా తీసుకునేందుకు పూర్తి ఏర్పాటు చేశామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో లంచగొండితనం లేకుండా పనులు జరుగుతాయని, ఏ ఫైల్ ఎక్కడ ఆగిందో వెంటనే తెలిసిపోతోందని తెలిపారు.

విద్యుత్ రంగంలో పవర్‌కట్ అంటే ఏమిటో తెలియని విధంగా ప్రణాళికలను రూపొందించామని చెప్పారు. క్రెడాయ్ ప్రతినిధుల సూచనలు తెలుసుకుంటామన్నారు. నిర్మాణ సంస్థలు ఒకేచోట కాకుం డా హైదరాబాద్ నలుమూలలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ తదితర కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. కాగా, ప్రాపర్టీ షో 15వ తేదీ వరకు కొనసాగనుందని, 115కుపైగా డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

వాసవీ గ్రూప్ ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్.రాంరెడ్డి, జి.రాంరెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, తెలంగాణ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ సీహెచ్.రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు ఆదిత్యగౌరా, ఆనంద్‌రెడ్డి, ఎం.ఎస్.ఆనంద్‌రావు, టి.మురళీ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీలు జి.మురళీ మోహన్, వి.రాజేశ్వర్‌రెడ్డి, సీఈవో ఎం.వి.రాజేశ్వర్‌రావులతో పాటు డెవలపర్లు, స్టేక్ హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు