‘కృష్ణా’ నీళ్లకు మూడు మార్గాలు

2 Nov, 2016 01:01 IST|Sakshi
‘కృష్ణా’ నీళ్లకు మూడు మార్గాలు

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇంజనీర్ల ఫోరం సూచనలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మూడు మార్గాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇంజనీర్ల ఫోరం సూచించింది. రాష్ట్రానికి ఉన్న పరీవాహకం ఆధారంగా వాటాలు దక్కించుకుంటేనే న్యాయం జరుగుతుందని, రాష్ట్ర అవసరాలు తీరుతాయని అభిప్రాయపడింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ, సభ్యులు మోహన్‌రావు, సీనియర్ జర్నిలిస్ట్ పాశం యాదగిరి మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.

కృష్ణా నదిలో తెలంగాణ పరీవాహకం 68.5 శాతం ఉన్నా కేటాయింపులు మాత్రం 37 శాతం మాత్రమే ఉన్నాయని, ఏపీకి పరివాహకం 31.5 శాతం ఉన్నా కేటాయింపులు 63 శాతం ఉన్నాయన్నారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం, నదీ పరీవాహకం ఆధారంగా జలాల పంపిణీ జరిగితే రాష్ట్రానికి 555 టీఎంసీల హక్కు వస్తుందన్నారు. కానీ ప్రస్తుత కేటాయింపులు కేవలం 299 టీఎంసీలు మాత్రమేనని వివరించారు. ప్రస్తుతం బ్రజేశ్‌కుమార్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలో రాష్ట్రానికి తగిన వాటా దక్కేలా వాదించాలని, అందులో ముఖ్యంగా మూడు వాదనలు ఉండాలని సూచించింది.

ఇవీ సూచనలు...
1. పరీవాహకం ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు, ఏపీకి 256 టీఎంసీలు దక్కా లి. కానీ ఇన్నేళ్లుగా 256 టీఎంసీలకు మించి 512 టీఎంసీలు వాడుకునున్నందున ఇప్పటికైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబరచాలి. ఏపీ తనకున్న 512 టీఎంసీల కేటాయింపులను తెలంగాణకు ఇచ్చి, తెలంగాణకున్న 299 టీఎంసీల కేటాయింపులను తీసుకునేం దుకు ముందుకు రావాలి. ఇందుకు వారిని ఒప్పించాలి. 194 టీఎంసీల మిగులు జలాల్లో తెలంగాణకు 133 టీఎంసీలు, ఏపీ 61 తీసుకునేలా చూడాలి. ఇలా చేస్తే తెలంగాణకు 645, ఏపీకి 360 టీఎంసీలు దక్కుతాయి.

2. రాష్ట్ర విభజన సమయంలో 58:42 నిష్పత్తి ప్రకారం ఆస్తులు, అప్పుల పంపకం జరిగినట్టే నీటిని పంచాలి. అయితే కృష్ణా పరీవాహకం 68.5 శాతం ఉన్నందున తెలంగాణకు కనీసం 58 శాతం నీటి వాటా ఇవ్వాలి. ఈ లెక్కన తెలంగాణకు నికర, మిగులు జలాలు కలిపి 583 టీఎంసీలు వచ్చేలా పోరాడాలి. ఏపీకి (341+81) 422 టీఎంసీలు దక్కేలా చూడాలి.

3. చివరి అవకాశంగా తెలంగాణకున్న కేటాయింపులు 299 టీఎంసీలకు తోడు ప్రస్తుతం పాలమూరు, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు అవసరమైన 212 టీఎంసీలు, పోలవరం ద్వారా దక్కే 30 టీఎంసీలు కలుపుకొని మొత్తంగా 541 టీఎంసీలు వచ్చేలా చూడాలి. ఇలా చేసినా రాష్ట్రానికి 54 శాతం వాటా దక్కుతాయి. అప్పుడు ఏపీకి 46 శాతం(464 టీఎంసీలు) వాటా దక్కుతుంది.

మరిన్ని వార్తలు