టిప్పు తుపాకీ మాయం?

11 Sep, 2016 01:54 IST|Sakshi
టిప్పు తుపాకీ మాయం?

15 ఏళ్లకు పైగా కనిపించని ‘మైసూర్ పులి’ ఆయుధం
 
ఈస్టిండియా కంపెనీ కూటమిలో భాగంగా టిప్పును ఓడించాక నిజాంకు దక్కిన తుపాకీ మ్యూజియానికి బహుమతిగా అందజేత స్టోర్‌లో ఉందంటున్నా బయటపెట్టని పురావస్తు శాఖ ఇప్పటి వరకు దృష్టి సారించని తెలంగాణ ప్రభుత్వం
 
 
సాక్షి, హైదరాబాద్: తాను వేటాడదలచుకున్న జంతువుపై పంజా విసిరేందుకు పులి కాచుక్కూర్చుంటుంది.. శత్రువును మట్టుబెట్టడంలో తన పంథా అదేనని చాటేందుకు ‘మైసూర్ పులి’ టిప్పు సుల్తాన్ తన తుపాకీపై పులి బొమ్మను చెక్కించాడు. 1799తో టిప్పు సుల్తాన్ జీవితం ముగిసిపోయింది.

మరి ఆయన ముచ్చటపడి తయారు చేయించుకున్న ఆ తుపాకీ ఎక్కడుంది? టిప్పు సామ్రాజ్యం ‘మైసూరు’లోనో.. ఆ ప్రాంతమున్న కర్ణాటక రాజధాని బెంగళూరులోనో కాదు.. మన భాగ్యనగరం హైదరాబాద్‌లో ఆ తుపాకీ ఉంది. కాదు ఉండేది.. ఇప్పుడు ‘అదృశ్యమైంది’. అదృశ్యమవడం ఏమిటనేదానికి పురావస్తు శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది.
 
ఎటు పోయింది?: టిప్పు సుల్తాన్ చేతిలో ఎంతో ఠీవిగా గర్జించిన ఆ తుపాకీ.. దాదాపు 15 ఏళ్ల కిందటి వరకు నాంపల్లిలోని ైవె ఎస్సార్ స్టేట్ మ్యూజియం సెంట్రల్ హాల్‌లో గంభీరంగా దర్శనమిచ్చింది. కానీ తర్వాత మాయమైపోయింది. అసలు సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించే పురాతన వస్తువుల  జాబితాలో ఆ చారిత్రక తుపాకీ టాప్‌లో నిలిచింది. అయితే టిప్పు తుపాకీ స్టోర్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు.

మరి అంత ప్రాధాన్యమున్న పురాతన సంపదను ఎందుకు దాచి పెట్టారనే దానికి మాత్రం సమాధానం లేదు. నిజంగా స్టోర్‌లో ఉందా, లేదా అన్నదానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కూడా ఇక్కడి చారిత్రక ప్రాధాన్యమున్న సంపద లెక్కలను ప్రభుత్వం తేల్చలేకపోయింది. ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమీక్ష కూడా జరగలేదు.
 
ఉన్నట్టుండి గల్లంతు...
టిప్పు సుల్తాన్ దాదాపు 1790 ప్రాంతంలో ప్రత్యేక నిపుణులతో ఈ తుపాకీని రూపొందించుకున్నారని చరిత్ర చెబుతోంది. కర్ర, బంగారం, వెండి, ఉక్కుతో దానిని రూపొందించారు. ఆ తుపాకీ బట్ (కలపతో చేసిన వెనుకభాగం)పై వేటలో నిమగ్నమైన పులి బొమ్మ ఉంటుంది. దాని కళ్లు మెరిసేలా బంగారంతో రూపొందించారు.
 
టిప్పు సుల్తాన్ ఎప్పుడూ ఆ తుపాకీని ధరించేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈస్టిండియా కంపెనీ, మరాఠాలు, నిజాం సైన్యం కూటమితో జరిగిన యుద్ధంలో టిప్పు ఓటమిపాలైనప్పుడు.. ఆ తుపాకీతోపాటు కొంత యుద్ధ సామగ్రిని నిజాం సైన్యం స్వాధీనం చేసుకుందని, వాటిని హైదరాబాద్‌కు తరలించి మ్యూజియంలో భద్రపరిచారని అంటారు.

అనంతర కాలంలో స్టేట్ మ్యూజియం ఏర్పాటు చేసినప్పుడు నిజాం ఆ తుపాకీని ప్రత్యేకంగా బహూకరించాడని చెబుతారు. అప్పటి నుంచి మ్యూజియం దిగువ భాగంలోని సెంట్రల్ హాల్‌లో టిప్పు తుపాకీని ప్రదర్శనకు ఉంచారు. సందర్శకులు ప్రత్యేకంగా దాన్ని చూసేందుకు బారులు తీరేవారు.
 
ఇప్పటికీ కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే సందర్శకులు టిప్పు తుపాకీ గురించి మ్యూజియం సిబ్బందిని ఆరా తీస్తుండటం గమనార్హం. కానీ చాలా కాలంగా అది కనిపించడం లేదు. దాన్ని త్వరలోనే సందర్శనకు ఏర్పాటు చేస్తామంటూనే దాదాపు పదిహేనేళ్లుగా వాయిదా వేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే బుద్ధుడికి సంబంధించిన మ్యూజియం రూపొందించే క్రమంలో టిప్పు తుపాకీతోపాటు కొంత యుద్ధ సామగ్రిని కూడా తరలించారని... తర్వాత వాటి కోసం ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేయలేక స్టోర్‌లో పడేశారని కొందరు సిబ్బంది అంటున్నారు. అధికారులు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పటం లేదు.

మరిన్ని వార్తలు