మనకు 1.5.. ఏపీకి 6.5

6 May, 2017 03:23 IST|Sakshi
మనకు 1.5.. ఏపీకి 6.5

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో 8 టీఎంసీల నీటిని పంపిణీ చేసిన కృష్ణా బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు పంచింది. అందులో తెలంగాణకు 1.5 టీఎంసీలు, ఏపీకి 6.5 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిని హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించగా.. ఏపీకి కేటాయించిన దానిలో సాగర్‌ కుడి కాల్వకు 2.5 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థ కింది అవసరాలకు 4 టీఎంసీలు ఇచ్చింది. మే నెల చివరి వరకు ఈ నీటిని వినియోగించుకోవాలని సూచిస్తూ.. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ శుక్ర వారం రాత్రి ఇరు రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లకు లేఖలు రాశారు. సాగర్‌లో 502 అడు గులు, శ్రీశైలంలో 765 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకునేందుకు అంగీకరిం చారు. ఈ మేరకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. నీటి విడుదలపై ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ భేటీ ఉండదని నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి.

టెలీమెట్రీపై వెనక్కి తగ్గిన బోర్డు...
టెలీమెట్రీ పరికరాల విషయంగా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో బోర్డు వెనక్కి తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు లేటర్‌ దిగువన 600 మీటర్ల వద్ద టెలీమెట్రీకి ప్రతిపాదించగా.. దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్‌ పాయింట్‌కు మార్చా లన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్‌ వరకు మధ్య లో 4,500 ఎకరాలకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథ కాలను ఏపీ నిర్వహిస్తోందని.. బంకచర్ల వరకు తాగునీటి పథకాలు సైతం ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇక సాగర్‌ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్‌ వద్ద ప్రతిపాదించిన పరికరాల ఏర్పాటును 102.63 కిలోమీటర్‌కు మార్చాలన్న నిర్ణయా న్నీ వెనక్కి తీసుకుంది. అలా చేస్తే ఏపీ పరిధి లోని నూతిపాడు కింద రెండు ఎత్తిపోతల పథకాల నీటి వినియోగం లెక్కలోకి రాదని రాష్ట్రం స్పష్టం చేసింది.

అభిప్రాయాలు చెప్పండి...
కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నియంత్రణపై బోర్డు రూపొందించిన వర్కింగ్‌ మ్యాన్యువల్‌పై ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరా లు తెలపాలని బోర్డు మరోమారు కోరింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా నియంత్రణలు ఉంటాయని బోర్డు తెలుపగా.. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక బోర్డు కేవలం వాటి నిర్వహణను మాత్రమే చూడాలని స్పష్టం చేసింది.

ట్రిబ్యునల్‌ కేటాయించిన ఎన్‌బ్లాక్‌ కేటాయింపులకు అనుగుణంగానే పంపిణీ జరగాలని, అంతకుమించి ఇతర ప్రత్యామ్నాయాలు వేటినీ ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. అయితే దీనిపై లిఖితపూ ర్వకంగా అభిప్రాయాలు తెలపాల్సి ఉంది. ఇక నీటి వినియోగ ప్రోటోకాల్, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి విడుదల తదితర అంశాల పైనా బోర్డు పలు వివరణలు కోరింది.

మరిన్ని వార్తలు