ఎండ తీవ్రతకు కోళ్లు విలవిల

12 Apr, 2016 05:31 IST|Sakshi
ఎండ తీవ్రతకు కోళ్లు విలవిల

ఇప్పటివరకు 30 లక్షలకు పైగా మృతి.. రూ.40 కోట్ల నష్టం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు విలవిలలాడుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఫారాల్లో కోళ్లు లక్షల సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఇప్పటిరకు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా వేసినట్లు జాతీయ గుడ్డు సమన్వయ సంఘం కార్యవర్గ సభ్యులు ఎ.సుధాకర్ ‘సాక్షి’కి చెప్పారు. సాధారణంగా 37-38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకు మాత్రమే కోళ్లు తట్టుకుంటాయి. అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదైతే చనిపోతాయి.

 నీరు లేక సమస్య: రాష్ట్రంలో 20 వేల కోళ్లఫారాలున్నాయి. వాటిలో 6.25 కోట్ల కోళ్లున్నాయి. అందులో 4.50 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లు, 1.75 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. సాధారణంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయితే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కోళ్ల ఫారాల్లో కర్టెన్లను తడపడం ద్వారా ఉష్ణోగ్రతలు పెరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

అటువంటి జాగ్రత్తలతో 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంత భారీ వే డి కారణంగా లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. పైగా భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లలో నీళ్లు లేకపోవడంతో నీటి సమస్య తలెత్తింది. ఫలితంగా కోళ్లపై నీళ్లు చల్లడానికి అవకాశం ఉండటం లేదు. పైగా కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వపరంగా ఆంక్షలు ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా ఉంది. కోళ్లు మృతి చెందటంతో వ్యాపారులకు రూ. 40 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. వాటికి బీమా సౌకర్యం లేకపోవడంతో నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు