మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు

19 Apr, 2016 03:22 IST|Sakshi
మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు

జస్టిస్ దిలీప్ బి.బొసాలే



హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి మంచి భవిష్యత్తు ఉందని, ప్రపంచం మొత్తం ఈ రంగంవైపు ఆసక్తిగా చూస్తోందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకున్న వారికి మంచి గుర్తింపుతోపాటు న్యాయవాదులతో సమానంగా ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార(ఏడీఆర్), కుటుంబ వివాద పరి ష్కార(ఎఫ్‌డీఆర్) విభాగాల్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐసీఏడీఆర్), నల్సార్ నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఐసీఏడీఆర్ కార్యాలయంలో జరిగింది. ఇందులో జస్టిస్ బొసాలే మాట్లాడుతూ సీపీసీలోని సెక్షన్ 89 వివాదాలను పరిష్కరించుకునేందుకు నాలుగు ప్రత్యామ్నాయ విధానాలను సూచించిందన్నారు. న్యాయస్థానాలకు చేరే వివాదాల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుందని, అయితే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ఇరువర్గాలూ విజయం సాధించవచ్చన్నారు. తాలూకా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని, అయితే తీవ్ర జాప్యం, న్యాయవాదులకు ఇచ్చే ఫీజు తదితర అంశాలతో చివరికి విజయం సాధించామనే ఆనందం కూడా ఉండదన్నారు. ఏడీఆర్ విధానం ద్వారా పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరిస్తున్నారని, దీంతో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నల్సార్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా పేర్కొన్నారు. ఏడీఆర్ విధానం ద్వారా కేసులను పరిష్కరించడానికి 12 నెలల గడువు నిర్దేశించారని, దీంతో వివాదాలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయన్నారు.


కుటుంబ, కార్మిక, వాహన ప్రమాదాలు, కాంట్రాక్టు వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ఐసీఏడీఆర్ ద్వారా ఇప్పటి వరకు 1,700 మందికి మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇచ్చామని ఐసీఏడీఆర్ ప్రాంతీయ విభాగం ఇన్‌చార్జి జేఎల్‌ఎన్ మూర్తి తెలిపారు. లీగల్ సర్వీస్ అథారిటీతో కలసి 18 జిల్లాల్లో ఏడీఆర్ విధానాలపై సదస్సులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన సి.సుబ్రమణ్యం అనే విద్యార్థికి బంగారు పతకాన్ని, మంజుశర్మ అనే విద్యార్థికి రజత పతకాన్ని జస్టిస్ బొసాలే అందజేశారు. అలాగే అధ్యాపక బృందంలోని వై.పద్మావతి, మోహన్‌కృష్ణ, సంధ్యారాణిలను కూడా జస్టిస్ బొసాలే సత్కరించారు. కార్యక్రమంలో నల్సార్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావు పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు