పేదలకు ఆహార భద్రత..

3 Jan, 2015 01:24 IST|Sakshi
పేదలకు ఆహార భద్రత..

కోటా పెంపు
నేటి నుంచి నగరంలో బియ్యం పంపిణీ
15 తర్వాత కొత్త వారికి

 
 సిటీబ్యూరో: ఆహార భద్రత పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద బియ్యం కోటాను పెంచడంతో మహానగరంలోని నిరుపేదల కష్టాలు దూరం కానున్నాయి. శనివారం నుంచి ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు బియ్యం అందనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ (పీడీఎస్) బియ్యం పంపిణీ పరిమితులను ఎత్తివేసిన విషయం విదితమే. ఇప్పటివరకు ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున.. కుటుం బానికి గరిష్టంగా 20 కిలోల వరకు పంపిణీ జరిగిదే. తాజాగా అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా... ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డులున్న వారికి కోటా పెంచి పంపిణీ చేయనున్నారు. కొత్త దరఖాస్తుదారులకు మాత్రం పరిశీలన పూర్తయిన తరువాత   అర్హులకు 15 నుంచి సరఫరా చేస్తారు. ఫలితంగా జనవరి నెల బియ్యం కోటా గతం కంటే 35 శాతం అదనంగా పెరిగినట్లయింది.

ఇదీ పరిస్థితి..

 హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 23.13 లక్షల కుటుంబాల వారు ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14.20లక్షల వరకు పాతవారున్నారు. దరఖాస్తుల పరిశీలన ఇప్పటివరకు 16 లక్షలు కూడా దాటలేదని సంబంధిత అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి గత నెల 25 నాటికే అర్హుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. నగరంలో దరఖాస్తుల పరిశీలన ఆల స్యంగా ప్రారంభమైన కారణంగా ఈనెల 15లోగా  పూర్తి చేసి అర్హులైన వారికి బియ్యం పంపినీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
 
అర్హులందరికీ కార్డులు..

 
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన లబ్ధిదారులు చౌకధరల దుకాణాల్లోని కీ రిజిస్టర్‌లో తమ కుటుంబ వివరాలను సరిచూసుకోవాలి. పేర్లు, అక్షరాలు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవాలి. పాత వారు శనివారం నుంచి, కొత్త వారు 15వ తేదీ తరువాత చౌకధర ల దుకాణాలకు వెళ్లి వివరాలను సరి చేసుకోవాలి.

 - డాక్టర్ పద్మ, సీఆర్వో, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు