నేడు డీఎస్, కెప్టెన్ నామినేషన్లు

31 May, 2016 03:29 IST|Sakshi

ఎన్నిక ఏకగ్రీవమే: ఈటల   
ఎంఐఎం మద్దతిస్తోంది: నాయిని


 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభకు పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారని ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ, 31న ఉదయం 11 గంటలకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజ సదారాంకు అందజేస్తారని చెప్పారు.

ఎంఐఎం తమకు మద్దతిస్తోందని, నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీని ఆహ్వానించామని నాయిని తెలిపారు. నామినేషన్ పత్రాలపై ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేస్తారని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు తెలంగాణ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న సీనియర్ నాయకులని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఒక్కో సీటును గెలుచుకోవడానికి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, టీఆర్‌ఎస్‌కు తప్ప ఆ సంఖ్య ఏ పార్టీకీ లేద న్నారు. రెండు స్థానాలనూ గెలుచుకుంటామని, ఏకగ్రీవం అయ్యేలా పార్టీలు సహకరిస్తాయన్న విశ్వాసం ఉందని ఈటల పేర్కొన్నారు.

 దారుస్సలాంకు టీఆర్‌ఎస్ నేతలు..
 అంతకుముందు నాయిని, ఈటల, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. దారుస్సలాంలో ఉన్న ఎంఐఎం పార్టీ కార్యాలయానికి వెళ్లిన వారికి ఒవైసీ సాదర స్వాగతం పలికారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని మంత్రులు కోరగా... మిత్రపక్షమైన టీఆర్‌ఎస్‌కు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని అసదుద్దీన్ తెలిపారు.

మరిన్ని వార్తలు